రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టైటిల్ విజయం కోసం తన జీవితాన్ని దారపోశా అని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ఈ రోజు వస్తుందని తాను అస్సలు అనుకోలేదని, చివరి బంతి వేసిన వెంటనే భావోద్వేగానికి గురయ్యానని చెప్పాడు. ఆర్సీబీకి తాను చేయగలిగిందంతా చేశానని, చివరకు ఐపీఎల్ టైటిల్ గెలవడం ఒక అద్భుతమైన అనుభూతి అని పేర్కొన్నాడు. ఈ విజయం జట్టుతో పాటు అభిమానులందరి అని విరాట్ స్పష్టం చేశాడు. మంగళవారం అహ్మదాబాద్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్లో ఆర్సీబీ 6 పరుగుల తేడాతో గెలుపొంది టైటిల్ కైవసం చేసుకుంది.
మ్యాచ్ అనంతరం కామెంటేటర్ మ్యాథ్యూ హేడెన్‌తో విరాట్ కోహ్లీ మాట్లాడాడు. ‘ఈ విజయం ఆర్సీబీ జట్టుకు ఎంత ముఖ్యమో, అభిమానులకు కూడా అంతే ముఖ్యం. 18 సంవత్సరాలు గడిచాయి. ఈ జట్టుకు అన్నీ ఇచ్చాను. ఈ గెలుపు కోసం నా జీవితాన్ని దారపోశా. ప్రతి సీజన్‌లో టైటిల్ గెలవడానికి ప్రయత్నించాను, నేను ఏం చేయగలనో అన్నీ చేశాను. చివరకు ఈ క్షణం రావడం నమ్మశక్యం కాని అనుభూతి. ఈ రోజు వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. చివరి బంతి వేయగానే నేను భావోద్వేగానికి గురయ్యాను. ఈ విజయం నాకు చాలా ముఖ్యం. నేను ఆర్సీబీ జట్టు కోసం ఎంతో శ్రమించాను. చివరకు ఐపీఎల్ టైటిల్ గెలవడం ఒక అద్భుతమైన అనుభూతి. ఈ విజయం ఆర్సీబీ జట్టుతో పాటు అభిమానులది కూడా. ఈ విజయం జట్టు, అభిమానులకు అంకితం’ అని కోహ్లీ చెప్పాడు.
Also Read: Virat Kohli: మైదానంలోనే ఏడ్చేసిన విరాట్ కోహ్లీ.. వీడియో వైరల్!
‘ఏబీ డివిలియర్స్ ఆర్సీబీ కోసం ఎంతో చేశాడు. మ్యాచ్‌కు ముందే అతడిని కలిసి కప్ మనదే అని చెప్పాను. ట్రోఫీని తీసుకునేటప్పుడు కలిసి సంబరాలు చేసుకోవాలని కోరాను. ఆర్సీబీ కోసం డివిలియర్స్ ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇప్పటికీ అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అతడి పేరుపైనే ఉన్నాయి. ఏబీడి రిటైర్మెంట్ ప్రకటించి నాలుగేళ్లు అవుతున్నా.. ఈ జట్టుపై ఎంతో ప్రేమ చూపిస్తాడు. ఆర్సీబీ ఫాన్స్, జట్టుపై అతడికి ఉన్న ప్రేమను నేను మాటల్లో వర్ణించలేను. మాతో పోడియంపై కప్ అందుకునేందుకు అతడు పూర్తి అర్హుడు. నిజాయితీగా చెప్పాలంటే గత 18 సంవత్సరాలుగా నా దగ్గర ఉన్న ప్రతిదాన్ని నేను జట్టుకు ఇచ్చాను. నేను ఈ జట్టుకు విధేయుడిగానే ఉన్నాను. నాకు ఇతర ఆలోచనలు వచ్చినా ఈ జట్టుకే కట్టుబడి ఉన్నాను. మేనేజ్‌మెంట్ నాకు అండగా ఉంది. ఆర్సీబీకి కప్ అందించాలన్నదే నా కల. నా హృదయం, ఆత్మ బెంగళూరుతోనే ఉంది. నేను చివరి వరకు ఆర్‌సీబీకే ఆడుతాను’ అని కింగ్ చెప్పుకొచ్చాడు.
