Site icon NTV Telugu

RCB Victory Parade: నేడు బెంగళూరులో ఆర్సీబీ విక్టరీ పరేడ్.. ఇక ఎర్ర సముద్రమే!

Rcb Victory Parade

Rcb Victory Parade

18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్‌ ట్రోఫీని ముద్దాడింది. మంగళవారం రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్‌లో 6 పరుగుల తేడాతో గెలిచిన ఆర్సీబీ.. ఐపీఎల్ 2025 టైటిల్‌ను కైవసం చేసుకుంది. మూడు సార్లు ఐపీఎల్ ఫైనల్లో భంగపడ్డ ఆర్సీబీ.. నాలుగో ప్రయత్నంలో ట్రోఫీని ఒడిసి పట్టింది. ఆర్సీబీ ఐపీఎల్ విజేతగా నిలవడంతో ఫాన్స్ సంబరాలు అంబరాన్ని అంటాయి. విజయాలు, పరాజయాల్లో ఎన్నో ఏళ్లుగా జట్టునేతోనే ఉన్న అభిమానులతో కలిసి సంబరాలు చేసుకొనేందుకు ఆర్సీబీ ఫ్రాంఛైజీ బెంగళూరులో విక్టరీ పరేడ్‌ నిర్వహిస్తోంది.

బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆర్సీబీ విక్టరీ పరేడ్ ప్రారంభం కానుంది. బెంగళూరులోని విధాన సౌధ వద్ద మొదలవనున్న విక్టరీ పరేడ్.. చిన్నస్వామి స్టేడియం వరకు సాగుతుంది. పరేడ్‌లో భారీ సంఖ్యలో ఫ్యాన్స్‌ పాల్గొననున్నారు. రెడ్‌ జెర్సీతో ఆ మార్గం మొత్తం ఎర్ర సముద్రాన్ని తలపించనుంది. పరేడ్‌లో పాల్గొనేందుకు ఫాన్స్ ఇప్పటికే సిద్దమయ్యారు. ఇందులో పలువురు ప్రముఖులు కూడా పాల్గొననున్నారని తెలుస్తోంది. ఈ కార్యక్రమంను స్టార్‌ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌, జియో హాట్‌స్టార్‌లో లైవ్‌ స్ట్రీమింగ్‌ కానుంది.

Also Read: IPL 2025 Awards: ఐపీఎల్ విజేత ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా.. అవార్డ్స్ ఫుల్ లిస్ట్ ఇదే!

‘ఈరోజు బెంగళూరులో ఆర్సీబీ విక్టరీ పరేడ్‌ ఉంది. 12th మెన్‌ ఆర్మీ (ఫాన్స్) ఇది ప్రత్యేకంగా మీకోసమే. మీ ప్రతి ఉత్సాహం, ప్రతి కన్నీటి చుక్క, ప్రతి సంవత్సరం కోసమే ఈ పరేడ్‌. లాయల్టీనే రాయల్టీ. ఈ కిరీటం మీదే’ అని ఆర్సీబీ ట్వీట్‌లో పేర్కొంది. విక్టరీ పరేడ్‌ ఆర్సీబీ ఫాన్స్ కోసమే ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లు ఫ్రాంఛైజీ యాజమాన్యం తెలిపింది. ఐపీఎల్‌లో ఏ జట్టుకు లేని ఫ్యాన్ బేస్ ఆర్సీబీకి ఉందన్న విషయం తెలిసిందే. 2008 నుంచి కప్ కొట్టకున్నా.. విజయాలు, పరాజయాల్లో అభిమానులు ఆర్సీబీతోనే ఉన్నారు. మ్యాచ్ ఎక్కడ జరిగినా స్టేడియం మొత్తం ఆర్సీబీ అభిమానులే ఉంటారు.

Exit mobile version