Satvika Veeravalli: ‘RC 17’ సినిమాకు హీరోయిన్ దొరికేసినట్టేనా..? హీరోయిన్‌గా తెలుగు అమ్మాయి..

Satvika Veeravalli

Satvika Veeravalli

Satvika Veeravalli – RC17: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్ అంటేనే టాలీవుడ్‌లో ‘రంగస్థలం’ సృష్టించిన ప్రభంజనం గుర్తుకువస్తుంది. దాదాపు ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వీరిద్దరి కలయికలో ‘RC 17’ ప్రాజెక్ట్ రాబోతోంది. ‘పుష్ప 2’ వంటి భారీ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడం, మరోవైపు ‘పెద్ది’ తర్వాత రామ్ చరణ్ ఎంచుకున్న కథ కావడంతో ఈ సినిమా ప్రకటన నుంచే భారతీయ సినీ పరిశ్రమ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే ఈ చిత్రంలో మెయిన్ లీడ్ హీరోయిన్ ఎంపికకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

సాధారణంగా సుకుమార్ సినిమాలలో హీరోయిన్ పాత్ర కేవలం పాటలు, రొమాంటిక్ సన్నివేశాలకు మాత్రమే పరిమితం కాకుండా కథను మలుపు తిప్పే బలమైన పాత్రగా ఉంటుంది. గతంలో ‘రంగస్థలం’లో రామలక్ష్మిగా సమంత పోషించిన పాత్ర ప్రేక్షకులపై ఎంతటి ప్రభావం చూపిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ‘RC 17’లో కూడా కథానాయిక పాత్ర ఎంతో భావోద్వేగభరితంగా, కథలో అత్యంత కీలకంగా ఉండబోతోందట. తొలుత ఈ పాత్ర కోసం సారా అర్జున్ పేరును పరిశీలించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆమె గతంలో అనేక చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించడం వల్ల, ఇప్పుడు స్టార్ హీరో సరసన పూర్తిస్థాయి హీరోయిన్‌గా చూపిస్తే ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందోనని చిత్రబృందం పునరాలోచనలో పడింది.

ఈ పాత్రకు అద్భుతమైన నటనతో పాటు తెలుగు భాషపై మంచి పట్టు, సహజమైన డైలాగ్ డెలివరీ ఎంతో అవసరం. అందుకే పరభాషా నటీమణుల కంటే తెలుగు మూలాలున్న ప్రతిభావంతురాలైన నటి అయితే బాగుంటుందని సుకుమార్ భావించారట. ఈ క్రమంలోనే ఆయన దృష్టి ఇటీవల వచ్చిన ‘ఆకాశంలో ఒక తార’ చిత్రంతో తన సహజ నటనతో ప్రేక్షకులను, విమర్శకులను మెప్పించిన సాత్విక వీరవల్లిపై పడింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, భావోద్వేగాలను పండించే తీరు సుకుమార్ బృందాన్ని ఎంతగానో ఆకట్టుకుందట. రామ్ చరణ్ పక్కన ఈ కొత్త జోడీ సెట్ అయితే తెరపై సరికొత్త ఫ్రెష్‌నెస్ కనిపిస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు. త్వరలోనే హైదరాబాద్‌లో సాత్విక వీరవల్లికి ప్రత్యేకంగా లుక్ టెస్ట్, స్క్రీన్ టెస్ట్ నిర్వహించి చరణ్ సరసన ఆమె జోడీ ఏ మేరకు కుదిరిందో పరిశీలించిన తర్వాతే అధికారిక ప్రకటన చేయనున్నారు.

టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ఏమాత్రం రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా, మరోవైపు ఈ సినిమాలోని తన పాత్ర కోసం రామ్ చరణ్ పూర్తి స్థాయి మేకోవర్‌లోకి వెళ్తున్నారు. బాడీ లాంగ్వేజ్, హెయిర్ స్టైల్ దగ్గర నుంచి సరికొత్త లుక్‌లో కనిపించడానికి ఆయన సిద్ధమవుతున్నారు. ఒకవేళ ఈ కాంబినేషన్ ఖరారైతే, చాలా కాలం తర్వాత ఒక భారీ పాన్ ఇండియా స్టార్ ప్రాజెక్ట్‌లో తెలుగు మూలాలు ఉన్న అమ్మాయికి ప్రధాన కథానాయిక అవకాశం దక్కినట్లవుతుంది. మరి రామ్ చరణ్ సరసన సాత్విక వీరవల్లి జోడీ ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.