NTV Telugu Site icon

RBI: ఆర్బీఐని ఆపటం కష్టమేనంటున్న నిపుణులు. చివరికి అదే నిజమైంది

RBI

RBI

RBI: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే నాలుగు సార్లు రెపో రేటును పెంచిన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.. మరోసారి కూడా వడ్డీ రేటును పెంచుతుందని చాలా మంది విశ్లేషకులు ముందుగానే భావించారు. కొంత మంది అనలిస్టులేమో ఈ ఆర్థిక సంవత్సరం చివరి వరకూ రెపో రేటు పెంపు ఉండబోదని, ఈ విషయంలో ఆర్‌బీఐ పాటిస్తున్న విరామం ఈ రెండు నెలలు కూడా కొనసాగుతుందని అనుకున్నారు.

ఈలోపు కేంద్ర ప్రభుత్వం కొత్త బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఆదాయ పన్ను పరిమితిని ఏడు లక్షల రూపాయల వరకు పెంచింది. దీంతో.. ఏప్రిల్‌ తర్వాత ప్రజలు ఎక్కువ ఖర్చులు పెట్టే సూచనలు ఉన్నాయని, ముఖ్యంగా వేతన జీవులు పొదుపు పాటించకపోవచ్చనే ఆందోళనలు మొదలయ్యాయి. అయితే.. మోడీ సర్కారు ఉద్దేశపూర్వకంగానే ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు.

read more: Positive News From Adani Group: అదానీ అంటే అదనే కాదు.. ఇదీనూ..

వచ్చేది ఎన్నికల సంవత్సరం కావటంతో జనాల చేతిలో డబ్బు ఎక్కువ ఉంటే అది పొలిటికల్‌గా ప్లస్‌ అవుతుందని ఆశించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. ప్రజలు ఎక్కువ వ్యయం చేస్తే ద్రవ్యోల్బణం పెరుగుతుందని, దాన్ని కట్టడి చేయటానికి ఆర్‌బీఐ కొత్త ఆర్థిక సంవత్సరంలోనే వడ్డీ రేటు పెంచుతుందని, అప్పటివరకు ఆగుతుందని ఆర్థికవేత్తలు అంచనా వేశారు.

కానీ.. ఈ లెక్కలన్నీ తారుమారయ్యాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఈ ఫీడ్‌బ్యాక్‌ని పరిగణనలోకి తీసుకోలేదు. సోమవారం నుంచి బుధవారం వరకు జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్ష సమావేశాల్లో కీలకమైన వడ్డీ రేట్లను 25 బేసిస్‌ పాయింట్లు పెంచారు. తద్వారా రెపో రేటును 6 పాయింట్‌ 5 శాతానికి చేర్చారు. దీన్నిబట్టి ఒక విషయం స్పష్టమవుతోంది. గవర్నమెంట్‌ ప్రవేశపెట్టిన ఎన్నికల బడ్జెట్‌.. ఆర్‌బీఐని ఆపతరం కాలేదని తేలిపోయింది.