Site icon NTV Telugu

Ravindra Jadeja: కెప్టెన్ శుభ్‌మాన్ మాట వినని జడేజా.. వీడియో వైరల్!

Jadeja Celebration's

Jadeja Celebration's

మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 311 పరుగులు వెనుకబడి ఉంది. అంతేకాదు రెండవ ఇన్నింగ్స్‌లో ఖాతా తెరవకుండానే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో ఓపెనర్ కేఎల్ రాహుల్ (90), కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (103) పోరాడారు. ఈ ఇద్దరు వెనుదిరిగినా.. వాషింగ్టన్‌ సుందర్ (101 నాటౌట్‌; 206 బంతుల్లో 9×4, 1×6), రవీంద్ర జడేజా (107 నాటౌట్‌; 185 బంతుల్లో 13×4, 1×6) క్రీజులో పాతుకుపోయారు. ఇద్దరు ఆల్‌రౌండర్‌లు గొప్పగా ఆడి మ్యాచ్‌ను డ్రాగా ముగించారు. అద్భుత ప్రదర్శన చేసిన సుందర్, జడేజాలపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే జడ్డుకు సబంధించిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.

వాషింగ్టన్‌ సుందర్, రవీంద్ర జడేజా క్రీజులో పాతుకుపోవడంతో మ్యాచ్ ఫలితం తేలే అవకాశం లేకుండా పోయింది. మాండేటరీ ఓవర్లు (చివరి 15) మొదలు కావడానికి ముందు డ్రాతో మ్యాచ్‌ను ముగిద్దాం అని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌.. భారత ఆటగాళ్లతో కరచాలనం చేయబోయాడు. అప్పటికే సెంచరీలకు చేరువగా ఉన్న జడేజా, సుందర్‌లు స్టోక్స్‌ ప్రతిపాదనను అంగీకరించలేదు. దీంతో స్టోక్స్‌తో పాటు ఇంగ్లీష్ ప్లేయర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. అదే సమయంలో డ్రెసింగ్ రూమ్‌లో ఉన్న టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్‌ నవ్వుతూ కనిపించాడు. భారత ప్లేయర్లు డ్రాకు అంగీకరించకపోవడంతో ఇంగ్లండ్ బౌలింగ్ చేసేందుకు సిద్ధమైంది.

రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌లు జో రూట్, హ్యారీ బ్రూక్‌ బౌలింగ్‌లో ధాటిగా ఆడారు. బ్రూక్ బౌలింగ్‌లో జడేజా సిక్స్ కొట్టి సెంచరీ పూర్తి చేశాడు. ఆ సమయంలో భారత డ్రెస్సింగ్ రూమ్‌లో ఆనంద వాతావరణం కనిపించింది. అర్ధ సెంచరీ లేదా సెంచరీ తర్వాత జడేజా తరచుగా చేసే కత్తిసాము శైలిలో సంబరాలు జరుపుకోవాలని కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ సైగలు చేశాడు. అయితే జడేజా కెప్టెన్ సంజ్ఞను పట్టించుకోలేదు. ఈసారి జడేజా వెరైటీ శైలిలో సంబరాలు జరుపుకున్నాడు. ఈసారి జడేజా ‘పుష్ప స్టైల్’లో సెలెబ్రేషన్స్ చేసుకున్నాడు. దాంతో డ్రెస్సింగ్ రూమ్‌లో అందరూ నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘కెప్టెన్ మాట వినని జడేజా’ అంటూ ఫాన్స్ సరదాగా కామెంట్స్ పెడుతున్నారు.

 

Exit mobile version