NTV Telugu Site icon

Ratan Tata: ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని అద్దిన అరుదైన పారిశ్రామిక వేత్త రతన్ టాటా: కేసీఆర్

Ratan Tata Kcr

Ratan Tata Kcr

దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్ టాటా మృతిపట్ల తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని అద్దిన అరుదైన పారిశ్రామిక వేత్త రతన్ టాటా అని పేర్కొన్నారు. సమాజ హితుడుగా వారి తాత్వికత, దార్శనిక కార్యాచరణ ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరికీ ఆదర్శం అని అన్నారు. రేపటి తరాల ఉజ్వల భబిష్యత్తుకోసం జీవితకాలం తపించిన రతన్ టాటా ఆదర్శాలు, కార్యాచరణ ప్రపంచ ఆర్థిక పారిశ్రామిక రంగానికి దిక్సూచిగా నిలవాలని కేసీఆర్ ఆకాంక్షించారు.

‘ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని అద్దిన అరుదైన పారిశ్రామిక వేత్త రతన్ టాటా. సమాజ హితుడుగా వారి తాత్వికత, దార్శనిక కార్యాచరణ ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరికీ ఆదర్శం. పారిశ్రామిక ప్రగతికి మానవీయ కోణాన్ని అద్దిన మానవతావాది, దార్శనికుడు, పరోపకారి రతన్ టాటా. అభివృద్ధి ఫలాలు కింది స్థాయికి చేరుకోవాలనే సామాజిక ఆర్థిక తాత్వికతను సొంతం చేసుకున్న అరుదైన పారిశ్రామిక వేత్త టాటా. సమాజ సంక్షేమం కోసం, రేపటి తరాల ఉజ్వల భబిష్యత్తు కోసం జీవితకాలం తపించిన ఆయన ఆదర్శాలు, కార్యాచరణ ప్రపంచ ఆర్థిక పారిశ్రామిక రంగానికి దిక్సూచిగా నిలవాలి’ అని కేసీఆర్ పేర్కొన్నారు.

నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఒక కార్యక్రమానికి హాజరై.. నూతన తెలంగాణ రాష్ట్రం అనతికాలంలో సాధిస్తున్న అభివృద్ధిని అభినందించడం, సాంకేతిక పారిశ్రామిక రంగాల్లో నాటి కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన దార్శనిక కార్యాచరణ పట్ల వారు ఆనందాన్ని వ్యక్తం చేయడం తెలంగాణకు గర్వకారణమని కేసీఆర్ స్మరించుకున్నారు. మానవతావాది టాటా మృతి భారత పారిశ్రామిక రంగానికే కాకుండా సమాజ సంక్షేమాన్ని ప్రగతిని కాంక్షించే ప్రతి ఒక్కరికీ తీరని లోటన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మాజీ సీఎం ప్రార్థించారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.