దక్షిణాది ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన అతికొద్ది మందిలో రష్మిక మందన్న ఒకరు. కన్నడ చిత్రం ‘కిర్రాక్ పార్టీ’తో కెరీర్ ప్రారంభించిన ఈ కొడుగు బ్యూటీ, టాలీవుడ్‌లో ‘ఛలో’ సినిమాతో అడుగుపెట్టింది. ‘గీత గోవిందం’లోని ‘గీత’ పాత్రతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది.కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, ‘పుష్ప’ సినిమాలో ‘శ్రీవల్లి’గా డీగ్లామరైజ్డ్ పాత్రలో నటించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వరుస పెట్టి సినిమాలు చేస్తూ, దేశంలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది.. ఇక చివరగా
రష్మిక మందన్న నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా ఆమె కెరీర్‌ను కొత్త మలుపు తిప్పింది. ఈ మూవీలో రష్మిక లోని నటిని కొత్తగా పరిచయం చేయడమే కాకుండా, బలమైన కథలను ఆమె తన భుజాలపై మోయగలదనే నమ్మకాన్ని దర్శకుల్లో కలిగించింది. అందుకే ఇప్పుడు ఆమె కోసం ప్రత్యేకంగా కథలు రాసే దర్శకుల సంఖ్య పెరుగుతోంది. కాగా ఈ రేసులో ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ ముందు వరుసలో ఉండటం విశేషం. అవును సమాచారం ప్రకారం రష్మిక కోసం ఆయన ఇప్పటికే ఒక స్క్రిప్ట్ సిద్ధం చేశారని, త్వరలోనే ఆమెకు వినిపించనున్నారని ఫిల్మ్ నగర్ సమాచారం.
ఇక మనకు తెలిసి అనుదీప్ అంటేనే కామెడీకి పెట్టింది పేరు, కానీ రష్మిక కోసం మాత్రం ఆయన తన శైలికి పూర్తి భిన్నమైన పక్కా సీరియస్ కథను సిద్ధం చేశారట. భావోద్వేగాలతో కూడిన ఈ ఎమోషనల్ డ్రామాను నిర్మించేందుకు స్వప్న సినిమా సంస్థ కూడా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. కామెడీ సినిమాలతో నవ్వించిన అనుదీప్, రష్మికలోని సీరియస్ యాంగిల్‌ను ఎలా చూపిస్తారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వార్త నిజమైతే రష్మిక ఖాతాలో మరో వైవిధ్యమైన సినిమా పడటం ఖాయంగా కనిపిస్తోంది.
