20 బంతుల్లో 5 వికెట్లు.. Rashid Khan మ్యాజిక్.. MI లండన్ విజయం..!

Rashid Khan

Rashid Khan

Rashid Khan: ది హండ్రెడ్ 2026 టోర్నమెంట్‌లో అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 5 వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టాడు. ఎంఐ లండన్ తరఫున ఆడుతున్న రషీద్.. మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ పై స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేశాడు. దీనితో ఎంఐ లండన్ 46 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

ఆదివారం (ఆగస్టు 2) జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఎంఐ లండన్ నిర్ణీత 100 బంతుల్లో 183 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ తర్వాత 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మాంచెస్టర్ సూపర్ జెయింట్స్‌ను రషీద్ ఖాన్ తన స్పిన్‌తో కుదేలు చేశాడు. తన నిర్ణిత 20 బంతుల్లో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇది ది హండ్రెడ్ టోర్నమెంట్‌లో రషీద్ ఖాన్‌కు తొలి ఐదు వికెట్ల ప్రదర్శన మాత్రమే కాకుండా.. ఈ లీగ్‌లో అతని కెరీర్‌లో ఇదే అత్యుత్తమ బౌలింగ్ ఫిగర్స్.

మ్యాచ్ అనంతరం మాట్లాడిన రషీద్ ఖాన్.. తన ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు. ఈ టోర్నమెంట్ ఇప్పటివరకు నాకు అంతగా కలిసిరాలేదు. అయితే నేను ఓర్పు కోల్పోకుండా నా బౌలింగ్‌పై దృష్టి పెట్టానని.. సరైన లైన్, లెంగ్త్‌లో బౌలింగ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకోవడంతో మంచి ఫలితం వచ్చిందని తెలిపాడు. ఎంఐ లండన్ కెప్టెన్ సామ్ కరన్ రషీద్ ఖాన్ ప్రదర్శనపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. మ్యాచ్ తర్వాత కరన్ మాట్లాడుతూ.. రషీద్ 5 వికెట్లు తీశాడని స్క్రీన్‌పై చూసే వరకు నాకు కూడా తెలియలేదు. అతను ఎంత ప్రశాంతంగా తన పని పూర్తి చేస్తాడో ఈ ప్రదర్శనే దానికి నిదర్శనమని ప్రశంసించాడు.

రషీద్ ఖాన్ ఐదు వికెట్ల ధాటికి మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ 95 బంతుల్లో 138 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఎంఐ లండన్ 46 పరుగుల తేడాతో విజయం సాధించింది. అద్భుత బౌలింగ్‌కు గాను రషీద్ ఖాన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ విజయంతో ఎంఐ లండన్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది.