Rashid Khan: అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తన స్వదేశంలో తీసుకుంటున్న భద్రతా చర్యలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. భద్రతా కారణాల దృష్ట్యా తాను బుల్లెట్‌ప్రూఫ్ కారులోనే ప్రయాణిస్తానని రషీద్ వెల్లడించాడు. తనకు ఉన్న ప్రజాదరణతో పాటు అభిమానుల ఉత్సాహం కొన్నిసార్లు అనూహ్య పరిస్థితులకు దారి తీయవచ్చని పేర్కొంటూ, ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా మారాయని స్పష్టం చేశాడు.
ఈ విషయాలను మాజీ ఇంగ్లండ్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్‌తో కలిసి పాల్గొన్న ‘ది స్విచ్’ కార్యక్రమంలో రషీద్ ఖాన్ వెల్లడించాడు. అఫ్గానిస్తాన్‌లో సాధారణంగా రోడ్లపై స్వేచ్ఛగా తిరగడం తనకు సాధ్యం కాదని, అందుకే ఎప్పటికప్పుడు కఠినమైన భద్రతా ఏర్పాట్లతోనే బయటకు వెళ్లాల్సి వస్తోందని చెప్పాడు. రషీద్ మాటలు విన్న పీటర్సన్ ఆశ్చర్యానికి గురయ్యాడు. ఈ ఇంటర్వ్యూలో పీటర్సన్ రషీద్ ఖాన్ ను నువ్వు మీ దేశంలో సాధారణంగా రోడ్లపై తిరగగలవా అని ప్రశ్నించించాడు.
Rashid Khan Uses A Bulletproof Car When Visiting Afghanistan! 😮 pic.twitter.com/53BZkyWunp
— The Switch | Kevin Pietersen (@kptheswitch) December 22, 2025
దీనికి గాను రషీద్ స్పందిస్తూ.. అసలు ఛాన్స్ లేదు అని నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. దానికి పీటర్సన్.. అవునా, నిజమా..? అసలెందుకు అలా అని అడిగాడు. దానికి సమాధానంగా.. తాను సాధారణ కారులో ప్రయాణించే అవకాశం లేదు. నేను తప్పనిసరిగా బుల్లెట్‌ప్రూఫ్ కారులోనే ప్రయాణించాలి. నా సొంత బుల్లెట్‌ప్రూఫ్ కారులోనే తిరుగుతాను అని రషీద్ ఖాన్ చెప్పాడు. అలాగే ఇది నా భద్రత కోసం అవసరం. నన్నెవరూ కాల్చబోరు. కానీ తప్పు చోట, తప్పు సమయంలో ఉంటే ప్రమాదం జరగవచ్చు. కార్ లాక్ అయి ఉంటుంది, అయినా కొందరు దాన్ని తెరవడానికి కూడా ప్రయత్నిస్తారు అని వివరించాడు.
తనకే ప్రత్యేకంగా ఈ భద్రతా ఏర్పాట్లు కాదని, అఫ్గానిస్తాన్‌లో ఉన్న చాలామంది ప్రముఖులు ఇదే తరహా భద్రతా చర్యలు తీసుకుంటారని రషీద్ ఖాన్ స్పష్టం చేశాడు. నా కారును ప్రత్యేకంగా తయారు చేయించుకున్నది. చాలా మంది ఇలాంటివే ఉపయోగిస్తారు. అఫ్గానిస్తాన్‌లో ఇది సాధారణ విషయమే అని అన్నాడు. దీనిపై స్పందించిన కెవిన్ పీటర్సన్ ఈ పరిస్థితిని ‘ఆసక్తికరమైన అంశమని అభివర్ణించాడు.
