Anantapur: రాప్తాడులో పాశవిక ఘటన.. తరగతి గదిలో పదో తరగతి బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి..

Raptadu School Girl

Raptadu School Girl

Anantapur: అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం పాశవిక ఘటన చోటు చేసుకుంది. విద్యార్థుల సందడితో కళకళలాడే పాఠశాల ప్రాంగణం ఒక్కసారిగా కేకలతో హోరెత్తింది. తరగతి గదిలో విద్యార్థులంతా పాఠాలు వింటున్న సమయాన, ఓ ఉన్మాది హఠాత్తుగా స్కూల్ ఆవరణలోకి చొరబడ్డాడు. పదో తరగతి చదువుతున్న ఓ బాలికని లక్ష్యంగా చేసుకుని, చెక్క మొద్దులు కోసే పదునైన ఎలక్ట్రిక్ రంపంతో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. ఆ ఆగంతకుడు బాలిక గొంతును దారుణంగా కోసేశాడు. ఆ బాలిక తీవ్ర రక్తస్రావంతో పాఠశాల ప్రాంగణంలోనే కుప్పకూలిపోయింది. కళ్లెదుటే జరిగిన ఈ ఊహించని ఘోరాన్ని చూసి తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఉపాధ్యాయులు తేరుకుని అతడిని పట్టుకునే లోపే ఆ దుండగుడు అక్కడ నుంచి వేగంగా పరారయ్యాడు.

రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న ఆ విద్యార్థినిని చూసి చలించిపోయిన పాఠశాల సిబ్బంది, స్థానికులు వెంటనే అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో వైద్యులు ఆ బాలికకు చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషయమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. బాధితురాలి కుడి చేయి తెగిపోగా.. ముఖంపై పెద్ద గాయం అయ్యింది. ప్రస్తుతం వైద్యులు ఆ బాలికను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు.. ఈ ఘటన గురించి సమాచారం అందగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. బాధితురాలు అయ్యవారిపల్లెకు చెందిన బాలికగా గుర్తించారు. ఆ దుండగుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తనకు వేధింపులు ఎదురైనట్లు ఎలాంటి సమాచారం అందించలేదని కుటుంబీకులు చెబుతున్నారు.