Dhurandhar: రన్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ‘ధురంధర్’ సినిమా ఇంకా బాక్సాఫీస్ దగ్గర దూకుడు తగ్గడం లేదు. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ఆరు వారాలు దాటినా థియేటర్లకు ప్రేక్షకులు పరుగులు పెడుతున్నారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై యాక్షన్ సినిమా ఇప్పుడు దేశీయంగా భారీ రికార్డులు సృష్టిస్తోంది. 43వ రోజు ముగిసే సరికి ‘ధురంధర్’ సినిమా భారత్‌లో మొత్తం 871.9 కోట్ల రూపాయలు వసూలు చేసింది. జనవరి 17న జియో స్టూడియోస్ తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. 42 రోజుల్లోనే సినిమా 869.8 కోట్లు సంపాదించగా, 43వ రోజు ఒక్కరోజే మరో రూ. 2.1 కోట్లు వసూలు చేసింది. “రోజురోజుకూ మరింత బలంగా దూసుకెళ్తూ, కొత్త యుగాన్ని సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లను ఏలుతోంది” అని జియో స్టూడియోస్ పోస్ట్‌లో పేర్కొంది.
READ MORE: Karthi : లోకేష్ కనకరాజ్ పై అసంతృప్తి.. సూపర్ హిట్ సీక్వెల్ నుండి కార్తీ ఔట్..
ఆరు వారాల కలెక్షన్లు చూస్తే సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో స్పష్టంగా అర్థమవుతుంది. మొదటి వారంలోనే రూ. 218 కోట్లు, రెండో వారంలో 261.5 కోట్లు, మూడో వారంలో 189.3 కోట్లు, నాలుగో వారంలో 115.7 కోట్లు వసూలు చేసింది. ఐదో వారంలో 56.35 కోట్లు, ఆరవ వారంలోనూ 28.95 కోట్లు రాబట్టింది. సాధారణంగా ఈ దశలో సినిమాల కలెక్షన్లు బాగా తగ్గిపోతాయి. కానీ ‘ధురంధర్’ మాత్రం ఇంకా నిలకడగా ఆదరణ పొందుతోంది. ఈ భారీ విజయం మధ్యలో నటుడు సునీల్ శెట్టి సినిమాపై స్పందించారు. రన్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా నటనపై ఆయన ప్రశంసలు కురిపించారు. “అక్షయ్ ఖన్నా 10కి 10 మార్కులు. ఆయన అద్భుతమైన నటుడు. కానీ రన్‌వీర్ సింగ్ అయితే 100కి 100. ఈ సినిమా మొత్తం రన్‌వీర్ చుట్టూనే తిరుగుతుంది. అక్షయ్ చాలా బాగా చేశాడు. కానీ రన్‌వీర్ తన నటనను కట్టడి చేసుకున్న తీరు గొప్పది. హీరోగా దేశభక్తి మాటలు చెప్పడం ఈజీ. కానీ మరో దేశంలో ఉండి, స్వదేశం కోసం తపనపడే పాత్రను మౌనంగా చూపించడం చాలా కష్టం” అని సునీల్ శెట్టి అన్నారు.