ఇటీవల టెస్టుల్లో ఘోర వైఫల్యం నేపథ్యంలో టీమిండియా స్టార్ బ్యాటర్లు రంజీ బాట పట్టారు. సీనియర్ బ్యాటర్ అయినా సరే దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందే అని బీసీసీఐ అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా సహా మరికొందరు రంజీ మ్యాచ్‌లు ఆడేందుకు సిద్దమయ్యారు. చాలా ఏళ్ల నుంచి స్టార్ ప్లేయర్స్ రంజీలు ఆడడం లేదు కాబట్టి.. ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.
నేటి నుంచి జమ్ము కశ్మీర్‌తో ముంబై రంజీ మ్యాచ్ మొదలవనుంది. అజింక్య రహానే సారథ్యంలో ముంబై తరఫున రోహిత్ శర్మ బరిలోకి దిగనున్నాడు. ముంబై జట్టులో యశస్వి జైశ్వాల్ కూడా ఉన్నాడు కాబట్టి.. అతడితోనే రోహిత్ ఇన్నింగ్స్‌ను ఆరంభించనున్నాడు. ఇటీవల పేలవ ఫామ్ నేపథ్యంలో హిట్‌మ్యాన్ ఎలా ఆడుతాడో అని ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఉన్న నేపథ్యంలో అతడు ఫామ్ అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. రోహిత్ రాకతో ఈ రంజీ మ్యాచ్‌కు క్రేజ్ పెరిగింది. 10 ఏళ్ల తర్వాత రంజీలో హిట్‌మ్యాన్ ఆటను చూసేందుకు స్థానికి అభిమానులు పోటెత్తనున్నారు.
Also Read: Samsung Galaxy S25: గెలాక్సీ ఎస్ 25 సిరీస్ ఫోన్లు వచ్చేసాయ్.. ధర, ఫీచర్లు ఇవే!
భారత కాలమానం ప్రకారం.. జమ్ము కశ్మీర్, ముంబై మ్యాచ్ ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానుంది. 9 గంటలకే టాస్ పడనుంది. రంజీ ట్రోఫీ 2025కి జియో సినిమా, స్పోర్ట్స్ 18 అధికారిక బ్రాడ్‌కాస్టర్లుగా ఉన్నాయి. జమ్ము కశ్మీర్, ముంబై రంజీ మ్యాచ్‌ను జియో సినిమాలో ఉచితంగా చూడవచ్చు. స్పోర్ట్స్ 18లో చూడాలంటే మాత్రం సబ్‌స్క్రిప్షన్ పక్కా.