రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ అమలులో అలసత్వం వహించిన అధికారులపై జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘనను తీవ్రంగా పరిగణించిన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, సంబంధిత సిబ్బందిపై వేటు వేశారు. ప్రజా పాలన కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో విజయవంతం చేయడంలో విఫలమైన ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫరూక్ నగర్ మండల పరిధిలోని బూర్గుల గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎం. సరోజపై ఈ చర్యలు తీసుకున్నారు. పై అధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండానే విధులకు గైర్హాజరు కావడం, కార్యాలయ రికార్డుల నిర్వహణలో అస్తవ్యస్తంగా వ్యవహరించడం ఆమె సస్పెన్షన్‌కు ప్రధాన కారణాలుగా నిలిచాయి.
Also Read:Hansika motwani: సినీ నటి హన్సికా విడాకులు.. 4 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి..
ఇదే మండలంలోని కాశిరెడ్డి గూడ పంచాయతీ కార్యదర్శి కె. వాసవాచారి కూడా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారు. ప్రజా పాలన లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమవ్వడం, రోజువారీ కార్యక్రమాలను నిర్లక్ష్యం చేయడంతో ఆయనపై కూడా వేటు పడింది. ఈ నెల 9వ తేదీన జిల్లా పంచాయతీ అధికారి (డిపివో) సురేష్ మోహన్ ఫరూక్ నగర్ మండలంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామాల్లో పనుల తీరును పరిశీలించిన ఆయన పలు లోపాలను గుర్తించి కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగానే క్రమశిక్షణా చర్యలు అమలయ్యాయి.
Also Read:Right To Die: ‘‘మరణించే హక్కు’’పై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. హరీష్ రాణా ఇక ప్రశాంతంగా చనిపోవచ్చు..
కేవలం కార్యదర్శులనే కాకుండా.. పర్యవేక్షణలో విఫలమైన ఉన్నతాధికారులను కూడా కలెక్టర్ వదలలేదు. మండలంలోని కార్యదర్శులకు సరైన దిశానిర్దేశం చేయడంలో విఫలమైన ఫరూక్ నగర్ మండల పంచాయతీ అధికారి (ఎంపీవో) ఎం. జయంత్ రెడ్డికి ఛార్జ్ మెమో జారీ చేశారు.
కందుకూరు మండలంలోని కందుకూరు, ముచ్చర్ల, కొత్తగూడ గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా తడి చెత్త, పొడి చెత్త సేకరణలో నిర్లక్ష్యం వహించినందుకు గాను కార్యదర్శులు ఇంద్రసేన రెడ్డి, శ్రీహరి, నరేందర్ గౌడ్లకు డీపీఓ షోకాజ్ నోటీసులు అందజేశారు.
