Ramayana Trailer: అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఆ అద్భుత ఘట్టం రానే వచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో, నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత భారీ బడ్జెట్ చిత్రం రామాయణం ధమాకా ట్రైలర్ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. గురువారం తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో, సరిగ్గా 4:15 గంటలకు మేకర్స్ ఈ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఈ విజువల్ వండర్ చూసిన ప్రతీ ఒక్కరూ ఇంతకాలం వేచి చూసినందుకు ఫలితం దక్కిందని మూవీ టీమ్‌ను ప్రశంసిస్తున్నారు.
ఈ ట్రైలర్ అద్భుతమైన గ్రాఫిక్స్‌తో ప్రేక్షకులను ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్తోంది. మన పురాణ కావ్యం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం పక్కా విజువల్ ట్రీట్‌లా నిలిచింది. ఇందులో ప్రతి సీన్ ఎంతో భవ్యంగా, అలౌకికంగా రూపుదిద్దుకుంది. ఇప్పటివరకు ఈ సినిమా నటీనటుల ఎంపికపై ఎన్నో అనుమానాలు, విమర్శలు వ్యక్తమయ్యాయి, కానీ ఈ ఒక్క ట్రైలర్‌తో ఆ ప్రశ్నలన్నింటికీ మేకర్స్ గట్టి సమాధానం ఇచ్చేశారు. ట్రైలర్ ఆరంభమే రాక్షస రాజు రావణాసురుడిగా కన్నడ రాకింగ్ స్టార్ యశ్ పవర్‌ఫుల్ ఎంట్రీతో ప్రారంభమవుతుంది. దశాననుడి మహా శక్తివంతమైన అవతారాన్ని ఎలాంటి అతి నాటకీయత (ఓవర్ ది టాప్) లేకుండా, చాలా గంభీరంగా, సహజంగా చూపించడం ఈ లుక్ ప్రత్యేకత. ఆ తర్వాత శ్రీరాముడి అవతారంలో రణబీర్ కపూర్ స్క్రీన్ పైకి రావడం, అలాగే సీతాదేవిగా సాయి పల్లవి కనిపించడం విశేషం. సాయి పల్లవిని సీతగా ఎంచుకోవడంపై గతంలో తలెత్తిన కామెంట్స్ అన్నింటికీ ఆమె చూపిన సీతాదేవి పాత్రలోని అమాయకత్వం, సాత్వికత, సాధికారత సరైన జవాబుగా నిలిచాయి.
మిగతా పాత్రల్లో లక్ష్మణుడిగా రవి దూబే, కైకేయిగా లారా దత్తా తమ నటనతో ఆకట్టుకున్నారు. వీరితో పాటు అరుణ్ గోవిల్, రకుల్ ప్రీత్ సింగ్, సన్నీ డియోల్, వివేక్ ఒబెరాయ్ వంటి నటీనటులు కీలక పాత్రల్లో మెరిశారు. అంతర్జాతీయ సంగీత దిగ్గజాలు ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మెర్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం రామాయణంలోని భావోద్వేగాలను హృదయానికి హత్తుకునేలా చేశాయి. గతంలో వచ్చిన టీజర్ పట్ల నిరాశ చెందిన అభిమానులకు, ఈ సారి దర్శకుడు నితేష్ తివారీ ఎలాంటి ఫిర్యాదుకూ తావులేకుండా ప్రతి చిన్న విషయాన్ని ఎంతో జాగ్రత్తగా తీర్చిదిద్దారు. నిర్మాత నమిత్ మల్హోత్రా, దర్శకుడు నితేష్ తివారీ కలసి తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మన సంస్కృతి, సాంప్రదాయాల గొప్పతనాన్ని చాటి చెప్పబోతోంది. ఈ ఏడాది దీపావళి కానుకగా థియేటర్లలోకి రాబోతున్న ఈ ‘రామాయణం’, ప్రపంచవ్యాప్త ప్రేక్షకులను ఆకట్టుకుని భారతీయ సినిమా చరిత్రలోనే ఒక సరికొత్త మైలురాయిగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.

