NTV Telugu Site icon

Ramachandra Reddy: ఎన్నికల సమయంలో ఇదంతా సహజమే.. వేమిరెడ్డి అసంతృప్తిపై పెద్దిరెడ్డి!

Ramachandra Reddy

Ramachandra Reddy

నెల్లూరుకు చెందిన వైసీపీ ఎంపీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అసంతృప్తిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. ఎన్నికల సమయంలో అసంతృప్తి సహజంగా ఉంటుందన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సరైన పనితీరు కనపరచని వారికి పార్టీ టికెట్ నిరాకరించిందన్నారు. వారు అసంతృప్తితో ఉండటం సాధారణమే అని, పార్టీ గెలిచే వారికే టికెట్ ఇవ్వాలనే ఆలోచనలో ఉంటుందని పెద్దిరెడ్డి చెప్పారు.

నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని అధిష్ఠానం ప్రకటించింది. తన పరిధిలో వచ్చే మూడు శాసనసభ నియోజకవర్గాల బరిలో అభ్యర్థులను మార్చాలని ఆయన ముందునుంచి పట్టుబడుతున్నారు. దీనిపై అధిష్ఠానం స్పందించకపోవడంతో.. కొన్ని రోజుల నుంచి వేమిరెడ్డి అసంతృప్తితో ఉంటున్నారు. తనకు పార్టీలో జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారే కానీ.. ఆ గౌరవం దక్కడం లేదని వేమిరెడ్డి తన అనుచరుల ఎదుట వాపోయినట్లు సమాచారం. శనివారం మధ్యాహ్నం ఉన్నపళాన నెల్లూరు నుంచి ఆయన పయనమయ్యారు. కొద్దిరోజుల పాటు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని అనుచరులకు, సిబ్బందికి సూచనలిచ్చారని తెలుస్తోంది.

Also Read: Kinjarapu Atchannaidu: కేంద్ర ఎన్నికల సంఘానికి అచ్చెన్నాయుడు లేఖ!

మరోవైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చనిపోయింది. కాంగ్రెస్ దహన సంస్కారాలకు వైఎస్ షర్మిలను తీసుకొచ్చారు. షర్మిల, కేవీపీ, రఘువీరా రెడ్డి, గిడుగు రుద్రరాజు కాంగ్రెస్ పాడే మోస్తున్నారు. ఇంకెవరైనా ఒకరు దొరికితే.. ఉట్టి పట్టుకునేందుకు బాగుంటుంది. చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా.. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్ భారీ విజయం సాధిస్తారు’ అని పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Show comments