Site icon NTV Telugu

Ayodhya Ram Mandir: అయోధ్యలో అద్భుత దృశ్యం.. బాలరాముడికి ‘సూర్యతిలకం’!

Surya Tilak On Balarama

Surya Tilak On Balarama

శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో ‘శ్రీరామ నవమి’ 2025 వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత జరుగుతోన్న రెండో వేడుకలు ఇవి. స్వామి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. ఈ సందర్భంగా అయోధ్య ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. బాలరాముడి నుదిటిపై ‘సూర్య తిలకం’తో భక్తజనం పరవశించిపోయారు. అధునాతన సాంకేతికత సాయంతో సూర్యకిరణాలు గర్భగుడిలోని రాముడి విగ్రహం నుదుటిపై తిలకం వలే 58 మిల్లీమీటర్ల పరిమాణంలో కొన్ని నిమిషాల పాటు ప్రసరించాయి.

అయోధ్యలో రామ నవమి సందర్భంగా సూర్యకిరణాలు రామ్ లల్లాకు మధ్యాహ్నం 12 గంటలకు నాలుగు నిమిషాల పాటు తిలకం పట్టాయి. గతేడాది మధ్యాహ్నం 12:16 గంటల సమయంలో సూర్యకిరణాలు బాలరాముడి నుదుటన తిలకంగా మూడున్నర నిమిషాల పాటు కనిపించాయి. అయోధ్య ఆలయంలో గర్భగుడిలోని రాముడి విగ్రహం నుదుటిపై సూర్యకిరణాలు పడేందుకు మూడో అంతస్తులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి శ్రీరామ నవమి రోజున బాలరాముడి నుదుటిపై తిలకం దిద్దేలా ఏర్పాట్లు చేశారు. బెంగళూరు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌(ఐఐఏ) శాస్త్రవేత్తలు, పరిశోధకుల సాయంతో కేంద్ర భవన నిర్మాణ పరిశోధన సంస్థ (సీబీఆర్‌ఐ) శాస్త్రవేత్తలు దీనిని నిర్మించారు.

Exit mobile version