టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మార్చి నెలలో భారీ పోటీ ఉంటుందని భావించిన ఫ్యాన్స్‌కు ఇప్పుడు నిరాశ తప్పేలా కనిపిస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’, నాచురల్ స్టార్ నాని క్రేజీ ప్రాజెక్ట్ ‘పారడైజ్’.. ఈ రెండు సినిమాలు మార్చి రిలీజ్ నుండి వెనక్కి తగ్గే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఫిలిం నగర్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.
మొదట రామ్ చరణ్ ‘పెద్ది’ విషయానికి వస్తే, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మార్చి నెలాఖరున ఈ సినిమాను థియేటర్లోకి తీసుకురావాలని చిత్ర యూనిట్ భావించినా, ఇంకా దాదాపు 30 రోజుల షూటింగ్ పెండింగ్ ఉందట. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్స్ పనులకు మరికొంత సమయం పట్టేలా ఉంది. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకూడదని భావిస్తున్న చరణ్, ఈ సినిమాను సమ్మర్ రేసులోకి అంటే ఏప్రిల్ లేదా మే కి వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట.
మరోవైపు, నాని-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న ‘పారడైజ్’ కూడా ఇదే బాటలో నడుస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ కోసం భారీగా విజువల్ ఎఫెక్ట్స్ వాడుతున్నారు. ఆ పనులు పూర్తి కావడానికి అదనపు సమయం కావాలని దర్శకుడు కోరడంతో, మార్చి 26 రిలీజ్ డేట్‌ను మార్చి, మే నెలలో సమ్మర్ స్పెషల్‌గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఒకవేళ ఈ రెండు పెద్ద సినిమాలు వాయిదా పడితే, సమ్మర్ బాక్సాఫీస్ దగ్గర అసలైన పోరు మొదలవ్వడం ఖాయం. దీనిపై అధికారిక ప్రకటన కోసం మెగా .. నాని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
