Mega Power Star Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ సెప్టెంబర్ 28తో నటునిగా పదిహేనేళ్ళు పూర్తి చేసుకుంటున్నారు. ఆయన హీరోగా రూపొందిన తొలి చిత్రం `చిరుత` 2007 సెప్టెంబర్ 28న జనం ముందు నిలచింది. ప్రేక్షకుల మదిని గెలిచింది. మెగాస్టార్ చిరంజీవి తనయునిగా రామ్ చరణ్ ను తెరపై చూడాలని తపించిన అభిమానులకు `చిరుత` చిత్రం ఆనందం పంచింది. అదే సమయంలో చిరంజీవి రాజకీయ ప్రవేశం గురించి ఆంధ్రప్రదేశ్ అంతటా ఆసక్తి నెలకొని ఉంది. దాంతో చిరంజీవి నటవారసుడు రామ్ చరణ్ హీరోగా అరంగేట్రం చేయడం చర్చనీయాంశమయింది. అందుకు తగ్గట్టుగానే `చిరుత`గా రామ్ చరణ్ సైతం తనదైన అభినయంతో ఆకట్టుకోవడం విశేషం. తెరపై తొలిసారి రామ్ చరణ్‌ను చూడగానే మెగాస్టార్ ఫ్యాన్స్ ఆనందం అంబరమంటింది. అప్పట్లో యువ కథానాయకులతో వరుస విజయాలు చూసిన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అంతకు ముందు పూరి జగన్నాథ్ దర్శకత్వంలోనే కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ చిన్న కుమారుడు పునీత్ `అప్పు`తో హీరోగా జనం ముందు నిలచి కన్నడనాట తనదైన బాణీ పలికించారు. ఆ కోణంలోనే చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తనయుని తొలి చిత్రానికి పూరి జగన్నాథ్ ను డైరెక్టర్ గా ఎంచుకున్నారనిపిస్తుంది.
టాలీవుడ్ లో అందరు టాప్ హీరోస్ తో చిత్రాలు నిర్మించిన వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ `చిరుత` చిత్రాన్ని నిర్మించడం విశేషం! దత్ ఎందరు స్టార్స్ తో సినిమాలు తీసినా, ఆయనకు అన్ని విధాలా అచ్చివచ్చిన కథానాయకుడు చిరంజీవి అనే చెప్పాలి. మెగాస్టార్ తో దత్ నిర్మించిన “జగదేకవీరుడు-అతిలోకసుందరి, చూడాలని ఉంది, ఇంద్ర` చిత్రాలు బ్లాక్ బస్టర్స్ గా నిలచిన విషయం తెలిసిందే. అందువల్ల రామ్ చరణ్ చిత్రాన్ని కూడా అశ్వనీదత్ నిర్మిస్తూ ఉండడంతో `చిరుత`కు ఓ స్పెషల్ క్రేజ్ లభించింది. చిరంజీవికి “చూడాలనివుంది, ఇంద్ర, ఠాగూర్“ వంటి మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ అందించిన మణిశర్మ `చిరుత`కు స్వరకల్పన చేయడం మరో విశేషం. ఇన్ని విధాలుగా పలు విశేషాలతో రూపొందిన `చిరుత`లో రామ్ చరణ్ సరసన నేహా శర్మ అనే బీహారీ అమ్మాయిని నాయికగా పరిచయం చేశారు పూరి జగన్నాథ్.
ఈ చిత్రంలో రామ్ చరణ్ డాన్స్, ఫైట్స్ జనాన్ని భలేగా కిర్రెక్కించాయి. ఇందులోని “యమహో యమా…“, “లవ్ యూ రా…“, “ఎందుకో పిచ్చి పిచ్చి…“, “చెమ్కా చెమ్కా…“, “మారో మారో…“,“ఇన్నాళ్ళు…“ అంటూ సాగే పాటలు అలరించాయి. ఈ పాటలను సీతారామశాస్త్రి, కందికొంండ, భాస్కరభట్ల, విశ్వ రాశారు. ఈ చిత్రానికి కథ, రచన, దర్శకత్వం పూరి జగన్నాథ్ సమకూర్చారు. ఈ సినిమా 178 కేంద్రాలలో డైరెక్టుగా, షిప్ట్ మీద మరో 15 కేంద్రాలలో అర్ధశతదినోత్సవం జరుపుకుంది. 38 కేంద్రాలలో శతదినోత్సవం చూసింది. పెట్టుబడికి రెట్టింపు రాబడి చూసింది. ఈ సినిమాను తమిళంలో `సిరుతై పులి`గా, మళయాళంలో `చీటా`గా అనువదించారు. ఈ సినిమా ఆధారంగా బెంగాలీలో `రంగ్ బాజ్` రూపొందింది.
Hero Vishal: బ్రేకింగ్.. హీరో విశాల్ ఇంటిపై రాళ్ల దాడి.. అద్దాలు ధ్వంసం
`చిరుత` సినిమాతో జనం ముందు హీరోగా నిలచిన రామ్ చరణ్ ఇప్పటి దాకా తనదైన బాణీ పలికిస్తూ సాగుతున్నారు. చెర్రీ రెండో చిత్రం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన `మగధీర`. ఈ సినిమాతో రామ్ చరణ్ తరిగిపోని, చెరిగిపోని రికార్డులు సొంతం చేసుకున్నారు. రెండు సినిమాలతోనే చరణ్ సాధించిన అపూర్వ విజయం మెగాస్టార్ అభిమానులకు మరింత ఆనందం పంచింది. పైగా `మగధీర` చిత్రంలోనే కాసేపు చిరంజీవి తెరపై కనిపించి, తన నటవారసుడు రామ్ చరణ్ అంటూ జనానికి డైలాగ్స్ తోనే పరిచయం చేయడం కూడా అలరించింది. `మగధీర` చిత్రం అనేక కేంద్రాలలో శతదినోత్సవాలు చూసింది. కర్నూల్‌లో గోల్డెన్ జూబ్లీ జరుపుకుంది. `మగధీర`తో మెగాస్టార్ అభిమానులను మురిపించిన రామ్ చరణ్ తరువాతి సినిమా `ఆరెంజ్`తో నిరాశ పరచినా,తరువాత వచ్చిన “రచ్చ, నాయక్“తో ఫ్యాన్స్ కు ఆనందం పంచారు. అమితాబ్ ను యాంగ్రీ యంగ్ మేన్ గా నిలిపిన `జంజీర్` ఆధారంగా రామ్ చరణ్ అదే టైటిల్ తో హిందీ చిత్రంలో నటించారు. ఆ సినిమా తెలుగులో `తుఫాన్` గా వచ్చింది. ఆ సినిమా అంతగా అలరించలేక పోయింది. ఆ తరువాత చెర్రీ చిత్రాలలో భారీ విజయాలేవీ అంతగా నమోదు కాలేదు. అయితే 2018లో సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన తొలి చిత్రం `రంగస్థలం` ఆ ఏడాది బంపర్ హిట్ గానిలచింది. తరువాత వచ్చిన `వినయ విధేయ రామా` నిరాశపరచినా, మూడేళ్ళ తరువాత తన మిత్రుడు తారక్ తో కలసి రాజమౌళి దర్శకత్వంలో నటించిన `ట్రిపుల్ ఆర్`తో మళ్ళీ అభిమానులకు ఆనందం పంచారు చరణ్.
చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన `ఖైదీ నంబర్ 150`తో రామ్ చరణ్ `కొణిదెల ప్రొడక్షన్స్` సంస్థను నెలకొల్పి నిర్మాతగానూ మారారు. తరువాత తండ్రితోనే భారీగా `సైరా నరసింహారెడ్డి` వంటి చారిత్రక చిత్రాన్ని నిర్మించారు. తన చిత్రాలకు తల్లి సురేఖ పేరును సమర్పకురాలిగా ప్రకటిస్తూంటారు. `కొణిదెల ప్రొడక్షన్స్` నిర్మాణ బాగస్వామ్యంలోనే `ఆచార్య` చిత్రం తెరకెక్కింది. ఇందులో తండ్రితో కలసి ఫుల్ లెన్త్ రోల్ పోషించారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. రామ్ చరణ్ సొంత పతాకంపైనే సూపర్ గుడ్ ఫిలిమ్స్ తో కలసి రూపొందిన `గాడ్ ఫాదర్` ఈ దసరా కానుకగా జనం ముందు నిలవనుంది.
రామ్ చరణ్ నటించిన `ట్రిపుల్ ఆర్` చిత్రం ఇప్పటికీ వార్తల్లో నానుతోంది. ఈ సినిమాలో చెర్రీతో కలసి నటించిన తారక్ తోపాటు రామ్ చరణ్ కు కూడా బెస్ట్ యాక్టర్ కేటగిరీలో ఆస్కార్ నామినేషన్ కూడా లభించే ఆస్కారం ఉందని వినిపిస్తోంది. చెర్రీ మరిన్ని సినిమాలతో అభిమానులకు ఆనందం పంచుతూ ఉంటారని ఆశిద్దాం.