ప్రభుత్వం నుంచి ఎన్నో పన్ను మినహాయింపులను బీసీసీఐ పొందుతోందని వస్తున్న విమర్శలపై బోర్డు వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పందించారు. ‘బీసీసీఐ కూడా ఓ కార్పొరేట్ కంపెనీ లాగే పన్నులు చెల్లిస్తుంది. జీఎస్టీ కూడా కడుతోంది. మాకు ఎటువంటి మినహాయింపులు లేవు. మేము వేల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో చెల్లిస్తున్నాం. రాష్ట్ర సంఘాలు కూడా పన్నులు కడుతున్నాయి. మేము ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి గ్రాంట్ కూడా తీసుకోము’ అని రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. దాంతో బీసీసీఐపై వస్తున్న విమర్శలకు చెక్ పడింది.
ఇటీవల సవరించిన జీఎస్టీ కారణంగా ఐపీఎల్ టిక్కెట్ల ధరలు భారీగా పెరగనున్నాయి. క్యాసినోలు, రేస్ క్లబ్‌లతో పాటు ఇప్పుడు ఐపీఎల్ టికెట్స్ కూడా 40 శాతం స్లాబ్ కిందకు వచ్చాయి. దాంతో రూ.500 టికెట్ ధర రూ.700 కాగా.. రూ.2000 టికెట్ ధర ఇప్పుడు రూ.2,800 అవుతుంది. అయితే అంతర్జాతీయ, దేశీయ మ్యాచ్‌లకు మాత్రం 18 శాతం జీఎస్టీ కొనసాగుతుంది. దీనిపై రాజీవ్ శుక్లా మాట్లాడారు. ‘ఎక్కువ మంది సాధారణ ప్రజలు ఐపీఎల్‌ను చూస్తారు. ధరల పెంపు ఖచ్చితంగా వారిపై ప్రభావం చూపుతుంది. చాలా మంది ఐపీఎల్ చూడటానికి వస్తారని నేను ఆశిస్తున్నాను’ అని ధీమా వ్యక్తం చేశారు.
Also Read: IND vs PAK: మా వేదనను అప్పుడే మర్చిపోయారా?.. బీసీసీఐపై పహల్గాం బాధితురాలు ఆగ్రహం!
ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు కారణంగా టీమిండియా జెర్సీ స్పాన్సర్‌గా ఉన్న డ్రీమ్ 11 వైదొలగిన విషయం తెలిసిందే. కొత్త జెర్సీ స్పాన్సర్ కోసం దరఖాస్తుల స్వీకరణ సెప్టెంబర్ 16న ముగియనుంది. దీనిపై రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. మరో 2,3 వారాల్లో కొత్త జెర్సీ స్పాన్సర్‌ను ప్రకటిస్తామని చెప్పారు. టెండర్ల ప్రకియ ప్రారంభమైందని, చాలా బిడ్లు వచ్చాయని తెలిపారు. ఇప్పటి వరకైతే ఎవరి పేరూ కన్ఫర్మ్ చేయలేదని, ప్రక్రియ పూర్తైన తర్వాత కంపెనీ పేరు వెల్లడిస్తాం అని రాజీవ్ శుక్లా చెప్పుకొచ్చారు.
