తెలంగాణ యువత సివిల్ సర్వీసెస్‌లో అత్యధిక సంఖ్యలో విజయం సాధించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి సంస్థ సంయుక్తంగా అమలు చేస్తున్న ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ పథకం మరోసారి సత్ఫలితాలను అందించింది. ఇటీవల విడుదలైన సివిల్స్ మెయిన్స్ ఫలితాల్లో 31 మంది తెలంగాణ అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించి తుది ఇంటర్వ్యూకు అర్హత సాధించారు.
సింగరేణి సంస్థ గత రెండేళ్లుగా తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధుల నుంచి ఈ పథకానికి ఆర్థిక సహకారం అందిస్తోంది. ఈ పథకం ద్వారా మొదటి ఏడాది 7 మంది, రెండో ఏడాది 20 మంది చొప్పున ఇప్పటివరకు మొత్తం 27 మంది సివిల్స్‌లో విజయం సాధించారు. ఈ ఏడాది సివిల్స్ ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులైన 158 మంది తెలంగాణ అభ్యర్థులకు రెండు నెలల క్రితం ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున మొత్తం రూ.1.58 కోట్లను సింగరేణి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఆ సాయంతో మెయిన్స్‌కు సిద్ధమైన వారిలో 31 మంది తుది ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, వీరికి ఇంటర్వ్యూ సన్నద్ధత కోసం సింగరేణి మరోసారి ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందించనుంది. అంతేకాకుండా, సింగరేణి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం త్వరలో వీరికి మాక్ ఇంటర్వ్యూలు కూడా నిర్వహించనుందని సంస్థ సీఎండీ డాక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి తెలిపారు.
తుది ఇంటర్వ్యూకు ఎంపికైన 31 మందిలో వరంగల్ జిల్లా నుంచి అత్యధికంగా ఆరుగురు ఉండగా, మేడ్చల్–మల్కాజిగిరి నుంచి నలుగురు, హైదరాబాద్, జగిత్యాల జిల్లాల నుంచి ముగ్గురు చొప్పున.. నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల నుంచి ఇద్దరు చొప్పున ఉన్నారు. అలాగే ఆదిలాబాద్, నారాయణపేట, సిద్దిపేట, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మంచిర్యాల జిల్లాల నుంచి ఒక్కొక్కరు చొప్పున అర్హత సాధించారు. సామాజిక వర్గాల వారీగా చూస్తే 18 మంది ఓబీసీ, 8 మంది జనరల్ కేటగిరీ, ముగ్గురు ఎస్సీ, ఇద్దరు ఎస్టీ అభ్యర్థులు ఉన్నారు.
తుది ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు. ఇంటర్వ్యూలోనూ విజయం సాధించి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణ యువతను అఖిల భారత సర్వీసుల వైపు ప్రోత్సహించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని సింగరేణి స్పష్టం చేసింది.

