సూపర్ స్టార్ రజనీకాంత్ మన దేశంలోనే కాదు.. విదేశాల్లో సైతం అభిమానులను కూడగట్టుకున్నారు. బాలీవుడ్‌లో కూడా మంచి పేరు సంపాదించిన రజినీకాంత్ అభిమానుల సంఖ్య అపారం. 74 ఏళ్ల వయసులో కూడా ఆయన క్రేజ్ తగ్గలేదు. ఈ వయసులో సైతం ప్రధాన నటుడిగా సినిమాలు చేస్తూ ప్రజాధారణ పొందుతున్నారు. కానీ.. సినిమాల్లోకి రాకముందు, రజనీకాంత్ ఒక థియేటర్ ఆర్టిస్ట్, బస్ కండక్టర్‌గా పనిచేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే, సినీ జీవితంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు చాలా అవస్థలు పడ్డారు. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆ సమయంలో రజినీకాంత్‌కి ఓ స్నేహితుడి అండ లభించింది. ఆ స్నేహితుడి సహాయంతో ‘మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్’లో అడ్మిషన్ పొందగలిగారు. ఇక్కడి నుంచే తన నటనా జీవితాన్ని ప్రారంభించారు.
READ MORE: PM Modi: “బ్రహ్మోస్ క్షిపణి” శబ్ధం వింటే పాకిస్తాన్‌కు నిద్రపట్టదు..
రజనీకాంత్ బస్ కండక్టర్‌గా పనిచేసేటప్పుడు.. ఆయనకు రాజ్ బహదూర్ అనే స్నేహితుడు ఉండేవారు. రజనీకాంత్‌కు నటన అంటే చాలా ఇష్టం అని ఆ మిత్రుడికి తెలుసు. అయితే, మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో అడ్మిషన్ పొందడానికి ఆ నటుడి వద్ద తగినంత డబ్బు లేదు. అప్పుడు రాజ్ బహదూర్ రజినీకాంత్‌కు సహాయం చేసి ప్రోత్సహించారు. తన స్నేహితుడు రాజ్ బహదూర్ చేసిన సహాయాన్ని ఎన్నటికీ మర్చిపోనని రజనీకాంత్ చెబుతూ ఉంటారు. 2021 సంవత్సరంలో జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా ప్రతిష్టాత్మకమైన ‘దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు’తో సత్కరించినప్పుడు నటుడు రాజ్ బహదూర్‌ను గుర్తుచేసుకున్నారు. తన మిత్రుడికి కృతజ్ఞతలు తెలిపారు.
