RR vs DC: ఐపీఎల్ సీజన్-16లో భాగంగా ఇవాళ అస్సాం రాష్ట్రం గౌహతిలోని బర్సపారా స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్-రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు రెండింట్లో ఓటమి మూటగట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్‌తోనైనా ఖాతా తెరవాలని చూస్తోంది. టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేస్తున్న రాజస్థాన్ మెరుపు వేగంతో ఇన్నింగ్స్‌ను ఆరంభించి.. ఢిల్లీ ముంగిట భారీ లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లలో రాజస్థాన్ 199 పరుగులు చేసింది. ఢిల్లీకి 200 పరుగులు లక్ష్యాన్ని అందించింది. రాజస్థాన్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ ఇన్నింగ్స్‌ను భారీ షాట్లతో ప్రారంభించి.. స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.
యశస్వి 31 బంతుల్లో 60 పరుగులు చేసి 98 పరుగుల వద్ద ఢిల్లీ బౌలర్ ముకేశ్ కుమార్ వేసిన 9వ ఓవర్‌లో ఔట్ కాగా.. అప్పటి నుంచి స్కోరు బోర్డు కాస్త నెమ్మదించింది. అనంతరం క్రీజులోకి వచ్చిన సంజు శాంసన్ డకౌట్ కావడంతో రాజస్థాన్ దూకుడుకు కళ్లెం పడినట్లయింది. 10వ ఓవర్ ఐదో బంతికి 103 పరుగుల స్కోర్ వద్ద కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో నోర్జేకు క్యాచ్ ఇచ్చి సంజూ శాంసన్ డకౌటయ్యాడు. అనంతరం వచ్చిన రియాన్ పరాగ్ (7) త్వరలోనే ఔట్ అయ్యాడు. వికెట్లు పడుతున్నా జోస్ బట్లర్ తన జోరును కొనసాగించాడు. 51 బంతుల్లో 79 పరుగులు చేసిన బట్లర్.. ముకేశ్ కుమార్ వేసిన 19వ ఓవర్లో అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఓపెనర్లు యశస్వి (60), బట్లర్ (79) మెరుపు అర్ధశతకాలు సాధించడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఆఖర్లో హెట్‌మేయర్ (39 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో సత్తా చాటాడు. డీసీ బౌలర్లలో ముకేశ్ కుమార్ 2, కుల్దీప్, రోవ్‌మన్ పావెల్ తలో వికెట్ దక్కించుకున్నారు.
