Private Doctors: రాజస్థాన్ ఆరోగ్య హక్కు బిల్లుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న ప్రైవేట్ వైద్యులు సోమవారం జైపూర్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఎంఎస్ హాస్పిటల్‌లోని రెసిడెంట్ డాక్టర్స్ హాస్టల్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన ర్యాలీలో వేలాది మంది వైద్యులు, వారి కుటుంబ సభ్యులు, మెడికల్ షాపు యజమానులతో పాటు వైద్యవృత్తితో సంబంధం ఉన్నవారు పాల్గొన్నారు. ఈ ర్యాలీ సుచ్నా కేంద్ర తిరహా, మహారాణి కాలేజ్ తిరహా, అశోక్ మార్గ్, ఎంఐ రోడ్డులోని పాంచ్ బత్తి మీదుగా సాగింది.
ప్రైవేట్ వైద్యుల సమ్మె కారణంగా కొన్ని రోజులుగా ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్‌హోమ్‌లు మూతపడడంతో ప్రభుత్వాసుపత్రుల్లో రోగుల రద్దీ నెలకొంది. ప్రైవేటు వైద్యులకు సంఘీభావంగా రాష్ట్రవ్యాప్తంగా వైద్యులు రెండు గంటలపాటు విధులు బహిష్కరించడంతో ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యసేవలు దెబ్బతిన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉషా శర్మ, ఇతర ఉన్నతాధికారులు ఆదివారం ఆందోళన చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రుల ప్రతినిధి బృందంతో సమావేశం నిర్వహించి, బిల్లుకు సంబంధించి వారి సూచనలపై చర్చ జరుపుతామని హామీ ఇచ్చారు. అయితే, వైద్యులు మొండిగా ఉన్నారు. బిల్లును ఉపసంహరించుకున్న తర్వాత మాత్రమే ఏదైనా చర్చ సాధ్యమవుతుందని చెప్పారు.
Read Also: Rahul Gandhi: రాహుల్ గాంధీకి మరో షాక్.. ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని నోటీసులు
ఈ బిల్లును గత వారం అసెంబ్లీ ఆమోదించింది. ఈ బిల్లు వల్ల తమ పనితీరులో బ్యూరోక్రాటిక్ జోక్యం పెరుగుతుందని ప్రైవేట్ వైద్యులు అంటున్నారు. మంగళవారం అసెంబ్లీ ఆమోదించిన రాజస్థాన్ ఆరోగ్య హక్కు బిల్లు ప్రకారం.. రాష్ట్రంలోని ప్రతి నివాసికి ఏదైనా ప్రజా ఆరోగ్య సంస్థ, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలలో ముందస్తు చెల్లింపు లేకుండా అత్యవసర చికిత్స, సంరక్షణ హక్కు ఉంటుంది. ఆరోగ్య హక్కు బిల్లుకు ఆమోదంతో దేశంలో ఇంత వరకు ఏ రాష్ట్రం తీసుకోని, తీసుకోలేని నిర్ణయాన్ని రాజస్థాన్ సర్కారు ఆచరణలో చూపించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ సేవలను ఉచితంగా పొందొచ్చు. అంతేకాదు, ఎంపిక చేసిన ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఇదే మాదిరిగా ఉచిత సేవలు పొందే హక్కు ప్రజలకు ఉంటుంది. వైద్యుల కన్సల్టేషన్, వైద్య పరీక్షలు, ఔషధాలు, అత్యవసర వైద్యం, శస్త్ర చికిత్సలను కొన్ని నిబంధనలు, షరతులకు లోబడి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ఎంపిక చేసిన ప్రైవేటు ఆసుపత్రుల్లో పొందొచ్చని ప్రభుత్వం ప్రకటించింది. రోడ్డు ప్రమాదాలకు గురైన వారు అత్యవసర వైద్యాన్ని రూపాయి చెల్లించకుండానే ఉచితంగా పొందొచ్చని బిల్లు స్పష్టం చేస్తోంది.