EC Arrenges Polling Booth for 35 Voters in Rajasthan: దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో పోలింగ్ ముగియగా.. నేడు (నవంబర్ 25) రాజస్థాన్‌లో పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ఆరంభమైన పోలింగ్.. సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. రాజస్థాన్‌లో మొత్తం 200 సీట్లకు గాను.. నేడు 199 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. కరణ్‌పూర్ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ కూనార్ మరణించడంతో అక్కడ ఎన్నిక వాయిదా పడింది.
ఈ ఎన్నికల్లో ఒక్క కుటుంబం కోసం అధికారులు ప్రత్యేకంగా ఒక పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేశారు. పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న బార్మర్ జిల్లా పార్ గ్రామంలో 35 మంది కోసం పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేశారు. దాంతో రాజస్థాన్ రాష్ట్రంలోనే అతి చిన్న పోలింగ్ కేంద్రంగా నిలిచింది. పార్ గ్రామంలో మూడు వేర్వేరు ఇళ్లలో నివసించే.. ఒకే కుటుంబానికి చెందిన 17 మంది మహిళలు, 18 మంది పురుషులు నేడు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
Also Read: IPL Auction 2024: సొంత గూటికి హార్దిక్ పాండ్యా.. ఏకంగా 15 కోట్లు!
పాక్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న పార్ గ్రామ ప్రజలు గత ఎన్నికల వరకు ఓటేయడానికి ఏకంగా 20 కిలోమీటర్ల దూరం వెళ్లేవారు. ఎడారిలో రోడ్లు సరిగా లేకపోవడంతో కాలినడకన, ఒంటెలపై వారు పోలింగ్ బూత్‌కు చేరుకొనేవారు. పోలింగ్ కేంద్రం 20 కిలోమీటర్ల దూరం ఉండటంతో కొందరు వృద్ధులు, మహిళలు తన ఓటు హక్కును వినియోగించుకునేవారు కాదు. ఈ పరిస్థితి తెలుసుకున్న ఎన్నికల కమిషన్ అధికారులు.. పార్ గ్రామంలో ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దాంతో ఆ గ్రామ జనాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.