Rajamahendravaram: గోదావరిలో హౌస్‌బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!

Rajamahendravaram Tourism

Rajamahendravaram Tourism

Godavari River Tourism: గోదావరి తీరంలో పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు కొత్త సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. రాజమహేంద్రవరంలో తొలిసారిగా హౌస్‌బోట్, ఫ్లోట్ ఇన్ డైన్ సేవలను ప్రారంభించారు. దీంతో గోదావరి పర్యాటకానికి మరింత ఆకర్షణ పెరగనుంది. హౌస్‌బోట్‌లో గోదావరి నదిపై విహరిస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సూర్యోదయం, సూర్యాస్తమయ దృశ్యాలను నది మధ్య నుంచి వీక్షించడంతో పాటు.. రాత్రి వేళల్లో గోదావరి మధ్యలోనే బస చేసే ప్రత్యేక అనుభూతిని కూడా పర్యాటకులు పొందవచ్చు.

కుటుంబ సభ్యులతో కలిసి విహారానికి వెళ్లేవారికి, ప్రత్యేక సందర్భాలను జరుపుకునే వారికి ఈ హౌస్‌బోట్ ఆకట్టుకోనుంది. నదీ ప్రయాణంతో పాటు ప్రశాంతమైన వాతావరణంలో కొంత సమయం గడిపే అవకాశం ఉండటంతో సందర్శకులకు ఇది కొత్త అనుభూతిని అందించనుంది. మరోవైపు కుటుంబ వేడుకలు, పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, ఇతర ప్రత్యేక సందర్భాల కోసం ఫ్లోట్ ఇన్ డైన్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. నదీ మధ్యలో క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేసుకుని ప్రత్యేకమైన సందర్భాలను మరింత మధురంగా జరుపుకునేలా ఈ సదుపాయాన్ని తీర్చిదిద్దారు.

ప్రస్తుతం ఇలాంటి సేవలు విజయవాడ, దిండి ప్రాంతాల్లో అందుబాటులో ఉండగా.. రాజమహేంద్రవరంలో మాత్రం తక్కువ ధరలకు అందిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులను కూడా ఆకర్షించే అవకాశం ఉంది. గోదావరి పుష్కరాల నేపథ్యంలో పర్యాటకులను పెద్దఎత్తున ఆకర్షించేందుకు ఈ కొత్త సేవలను ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. పుష్కరాల సమయంలో రాజమహేంద్రవరానికి వచ్చే సందర్శకులకు గోదావరి విహారం మరో ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. ఇప్పటికే గోదావరి తీరంలోని ప్రకృతి సౌందర్యం, చారిత్రక ప్రదేశాలు పర్యాటకులను ఆకట్టుకుంటుండగా.. హౌస్‌బోట్, ఫ్లోట్ ఇన్ డైన్ సేవలు అందుబాటులోకి రావడంతో నగర పర్యాటక రంగానికి కొత్త ఊపు వస్తుందని స్థానికులు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని వాటర్ టూరిజం సదుపాయాలు అందుబాటులోకి వస్తే రాజమహేంద్రవరం ప్రముఖ పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది.