NTV Telugu Site icon

Komatireddy Venkat Reddy: అవినీతిని ప్రశ్నిస్తే చంపేస్తారా? బీఆర్ఎస్పై సంచలన వ్యాఖ్యలు

Komiti Reddy (1)

Komiti Reddy (1)

Komatireddy Venkat Reddy: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. భూపాలపల్లి రాజలింగమూర్తి హత్య కేసును కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకుంది. ఈ హత్య కేసుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ నేత హరీష్ రావుపై ధ్వజమెత్తారు. రాజలింగం హత్యను దారి మళ్లించేందుకు హరీష్ రావు కృష్ణా నీటి వివాదం గురించి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ఈ హత్య కేసు వెనక మాజీ సీఎం కేసీఆర్ హస్తం ఉందని ఆరోపించిన ఆయన, ‘‘అవినీతిని ప్రశ్నిస్తే చంపేస్తారా? రాజలింగంను హత్య చేయించి, ఇప్పుడు నేరాన్ని దాచేందుకు నీటి వివాదం లేపుతున్నారా?’’ అంటూ మండిపడ్డారు. అలాగే హరీష్ రావుపై తీవ్ర విమర్శలు చేస్తూ.. ‘‘కృష్ణా నదీ నీటి దోపిడీకి అసలు కారణం ఎవరు? వైఎస్ జగన్‌తో దోస్తానా చేసి శ్రీశైలం, నాగార్జున సాగర్ నీళ్లు దోచి పెట్టింది నువ్వే కదా?’’ అని ఆయన నిలదీశారు.

Read Also: Abhi : తొలి సినిమానే డిఫరెంట్‌ కాన్సెప్ట్‌.. యంగ్‌ డైరెక్టర్‌ సాహసం

హరీష్ రావును దుయ్యబట్టిన కోమటిరెడ్డి, కేసీఆర్‌పై కూడా విమర్శలు గుప్పించారు. మా ప్రభుత్వం ఏర్పడిన మూడు రోజుల నుంచే కూలిపోతుందని అంటున్నారు. అసలు ఫార్మ్ హౌస్‌ నుంచి బయటకు రాకుండా కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గిందని ఎలా చెప్పగలిగారు? 15 నెలల్లో మేము చేసిన మంచి పనులేవీ కనిపించవా? అంటూ ప్రశ్నించారు. రాజలింగం హత్య కేసు వెనుక కేసీఆర్ హస్తం ఉందని ఆరోపించిన కోమటిరెడ్డి, ‘‘చట్టం ముందు అందరూ సమానులే! బాధిత కుటుంబం కేసీఆర్, కేటీఆర్, గండ్ర పేర్లు చెబుతోంది. హత్యలను ప్రోత్సహించకండి.. మాజీ ఎమ్మెల్యే సరెండర్ కావాలి. రాజలింగం కేసులో సీజే సుమోటోగా తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Read Also: Hyderabad Doctor: సరదాగా ఈత కోసం నదిలోకి దూకిన లేడి డాక్టర్.. చివరకు?

రాజలింగం హత్యపై సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్‌గా ఉన్నారని, దర్యాప్తు జరుగుతోందని ఆయన తెలిపారు. ‘దమ్ముంటే మీరు చేసిన మంచి పనులు చెప్పుకోండి. కేసీఆర్ దోపిడీ ప్రశ్నిస్తే హత్యలు చేయిస్తున్నావు.. కేసీఆర్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతావు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో రాజలింగం హత్య కేసు మరింత రాజకీయ మలుపు తిరిగే అవకాశముంది. ఈ కేసులో ఏమైనా సంచలన విషయాలు వెలుగు చూస్తాయా? హత్య వెనక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? అనేది సమగ్ర దర్యాప్తులో తేలనుంది.