NTV Telugu Site icon

MP Margani Bharat: అప్పుడు బందిపోటు.. ఇప్పుడెలా అవసరమయ్యారు?

Mp Bharat

Mp Bharat

MP Margani Bharat: సెఫాలజిస్టు ప్రశాంత్ కిశోర్(పీకే)ను ఒకనాడు బీహారీ బందిపోటుగా, గజ దొంగగా అభివర్ణించిన చంద్రబాబు ఇప్పుడెలా ఆయనను పక్కన కూర్చోబెట్టుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ సూటిగా ప్రశ్నించారు. రాజమండ్రిలో భరత్ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు వ్యవహార తీరు, రాజకీయ వ్యూహాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజానికి చంద్రబాబు ఒక పెద్ద గజ దొంగ అని ఆరోపించారు. రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు అన్న మాటల్లో వాస్తవం ఉందన్నారు. ఏ సెఫాలజిస్ట్ అయినా ఒకటీ రెండు శాతం‌ మాత్రమే ప్రభావం చూపగలరని, ప్రజల అభిమానం ఉండకపోతే ఎవరూ ఏమీ చేయలేరన్నారు. టీడీపీపై ప్రజల్లో నమ్మకం లేనప్పుడు ఏ సెఫాలజిస్ట్ చేసేదేమీ ఉండదని. ఆరోపించారు. తెలంగాణాలో నివాసం ఉంటూ ఏపీలో రాజకీయ వ్యాపారాలు చేసే వలస పక్షుల జిమ్మిక్కులు నమ్మే స్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు లేరన్నారు. 2014లో రాష్ట్ర విభజన కారణంగా ఏర్పడిన నవ్యాంధ్రాకు అనుభవజ్ఞుడు కావాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబును సీఎంగా ఎన్నుకుంటే ఆ అయిదేళ్ళలో రాష్ట్రాన్ని నిలువునా ముంచేశారని, ప్రజల ఖజానాను దోచుకున్నారని‌ తీవ్రంగా ఆరోపించారు.

Read Also: TDP vs YSRCP: నెట్టింట వైసీపీ-టీడీపీల మధ్య ‘డంకీ’ పోస్టర్‌ వార్

ప్రజలకు చేసిందేమీ లేకపోగా మళ్ళా ఇప్పుడు ‘మీ‌‌ భవిష్యత్తు కు గ్యారంటీ, బాబు ష్యూరిటీ..అంటూ ఏ ముఖం పెట్టుకుని ప్రజల వద్దకు వస్తున్నారని ప్రశ్నించారు. నిలువునా ప్రజా ధనాన్ని దోపిడీ చేసిన చంద్రబాబు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని, ప్రజల ముంగిటకు వస్తే నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని ఏనాడో ప్రజలు గ్రహించారన్నారు. ఆనాడు కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తూ స్వర్గీయ ఎన్టీఆర్ టీడీపీని‌ ఏర్పాటు చేస్తే..అదే కాంగ్రెస్ తో చేతులు కలిపి చంద్రబాబు ఏ విధంగా రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచిన మోసగాడికి ప్రజలను మోసం చేయడం కష్టమేమీ కాదని..ప్రజలు అప్రమత్తంగా ఉండి రాష్ట్రంలో దొంగలు పడకుండా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని‌ హెచ్చరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఈ రాష్ట్ర ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారని, ఇచ్చిన హామీలన్నటినీ నెరవేర్చారని..రానున్న ఎన్నికలలో విజయానికి ఇవన్నీ దోహదపడతాయని ఎంపీ భరత్ ఆశాభావం వ్యక్తం చేశారు.