Rajahmundry MP Margani Bharat: నిన్న ( ఆదివారం ) ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రత్యేక హోదా గురించి ఎందుకు అడగలేదని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ప్రశ్నించారు. చిలకలూరిపేటలో జరిగిన టీడీపీ- బీజేపీ- జనసేన ఉమ్మడి సభ ఫ్లాప్ అయిందని ఆరోపించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సభలో మైకులు పని చేయలేదు.. పరిస్థితులు, దేవుడు వారి పక్షాన లేడని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది భారతీయ జనతా పార్టీ.. ఈ పార్టీతో టీడీపీ – జనసేన కలయికలు అక్రమ కలయిక అంటూ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: IPL 2024: గుజరాత్ టైటాన్స్‌లోకి గిల్ ఎంట్రీ.. స్టయిలిష్ లుక్‌లో అదిరిపోయాడుగా!
గతంలో చంద్రబాబు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని చాలా అనరాని మాటలు అన్నారు అనే విషయాన్ని ఎంపీ మార్గాని భరత్ రామ్ గుర్తు చేశారు. ఇప్పుడు చంద్రబాబు- పవన్ కళ్యాణ్ లు కలిసి రాష్ట్రాన్ని నరేంద్ర మోడీకి తాకట్టు పెట్టాలని అనుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారని ఆయన ప్రశ్నించారు. విలువలు, విశ్వసనీయత అనే పదాలు చంద్రబాబు జీవితంలో తెలుసుకోలేరు.. పవన్ కళ్యాణ్- చంద్రబాబులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఆలోచించే వ్యక్తులు కాదు.. పార్లమెంట్లో పాస్ అయిన బిల్లులకు కూడా ఈ రోజుకి అతి గతి లేదని, విభజన హామీలను ఇంకా అమలు చేయలేదని విమర్శించారు. మోసం చేయడం అనేది చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అంటూ రాజమండ్రి వైసీపీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆరోపించారు.