NTV Telugu Site icon

MP Margani Bharat: శభాష్ భరత్.. గోదావరిలో దూకబోయిన యువకుడిని కాపాడిన‌ ఎంపీ

Rjy Mp

Rjy Mp

ఎంపీ అయి ఉండి శభాష్ అనిపించుకునే పనిచేశారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్. గోదావరిలో దూకబోయిన యువకుడిని కాపాడారు ఎంపీ. ఆ యువకుడి హృదయానికి ఏమి గాయమైందో, ఏమి‌ కష్టం వచ్చిందో తెలియదు కానీ తనువు చాలించాలనే కఠోర నిర్ణయానికి వచ్చాడు. అనుకున్నదే తడువుగా తన స్వగ్రామం ఉనకరమిల్లి (నిడదవోలు మండలం) నుండి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు దూరంగా బైక్ పై రాజమండ్రి- కొవ్వూరు రోడ్డు కం‌ రైలు వంతెనపైకి చేరాడు. బైక్ ఒక పక్కన బెట్టి, ఒక్కసారిగా బ్రిడ్జి పై నుండి గోదావరిలో దూకేందుకు సిద్ధమయ్యాడు.

Read Also: Top Headlines @5PM: టాప్ న్యూస్

సరిగ్గా అదే సమయంలో గోపాలపురంలోని ఒక శుభ కార్యక్రమానికి బయల్దేరిన రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ కంట ఈ దృశ్యం పడింది. అంతే‌ ఆయన వాహనాన్ని ఆపేశారు. కారులో నుండి ఒక్క ఉదుటున దూకి, ఆ వెనువెంటనే ఆ యువకుని కాలర్ పట్టుకుని వెనక్కి లాగారు. ఆ తరువాత యువకుని జబ్బ పట్టుకుని గట్టు (ఫుట్ పాత్)పై నుండి రోడ్డు మీదకు బలంగా లాగారు. అంతే ఎంపీ అనుచరులు ఆ యువకుడిని పట్టుకున్నారు. ఈ హఠాత్పరిణామానికి ఆ యువకుడు హతాశుడయ్యాడు. కొద్ది సేపటి వరకూ షాక్ నుండి తేరుకోలేకపోయాడు.

నీకేం కష్టం వచ్చిందని ఎంపీ మార్గాని భరత్ చాలా అనునయంగా ఆ యువకుడిని అడిగారు. పొంతన లేని సమాధానాలు చెబుతుండటంతో వెంటనే రాజమండ్రి టూ టౌన్ సీఐ టీ గణేష్ కు ఫోన్ చేసి కౌన్సెలింగ్ ఇప్పించమని ఎంపీ భరత్ ఆదేశించారు. ఆటోలో కొంతమంది సహాయంతో నగరంలోని రెండవ పట్టణ పోలీసు స్టేషన్ కు తరలించారు. ఆ యువకుని పేరు అయ్యప్ప అని, తండ్రి పేరు సీతాపతిరావు అని పోలీసులకు చెప్పాడు. తన తల్లిదండ్రులకు ఆరవ సంతానంగా తాను జన్మించానని, తాడేపల్లిగూడెం శశి ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ పూర్తి చేసి, జడ్చర్ల అరబిందో ఫార్మసీ లో మూడు సంవత్సరాలు జాబ్ చేసినట్టు పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పాడు. ‌కాగా యువకుడిని కాపాడిన ఎంపీ భరత్ ను పలువురు అభినందించారు.

Read Also: Lexi: ఇండియా మొట్టమొదటి చాట్‌బాట్ ‘లెక్సీ’..బెనిఫిట్స్ ఇవే!