Rajahmundry Adulterated Milk: రాజమండ్రి కల్తీ పాల ఘటన.. ఆగని మృత్యు ఘోష!

  • రాజమండ్రిలో కల్తీ పాల ఘటన
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి
  • పాలలో ఇథిలీన్ గ్లైకాల్ అనే అత్యంత విషపూరిత రసాయనం
Rajahmundry Adulterated Milk

Rajahmundry Adulterated Milk

రాజమండ్రిలో కల్తీ పాల ఘటన మళ్లీ విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి చెందడంతో మృతుల సంఖ్య 16కు చేరింది. రాజమండ్రి రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన పిచ్చుక నాగేశ్వరరావు (72) గత నెల 16న కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురయ్యారు. నెల రోజులుగా స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కిడ్నీలు దెబ్బతినడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. గత ఫిబ్రవరి 16వ తేదీన రాజమండ్రిలో కల్తీ పాలు ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పాలలో ఇథిలీన్ గ్లైకాల్ అనే అత్యంత విషపూరిత రసాయనం కలిసినట్లు అధికారులు నిర్ధారించారు.

Also Read: Dasun Shanaka-IPL 226: ఐపీఎల్ ప్రభావం.. శ్రీలంక కెప్టెన్ దసున్ షనక కీలక నిర్ణయం!

కల్తీ పాల ఘటనలో మొత్తం 20 మంది అస్వస్థతకు గురవగా.. ఇప్పటివరకు 16 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఇద్దరు చిన్నారులు సహా మరో వ్యక్తి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటన్ లో వెల్లడించారు. ఇక ఇదే ఘటనలో బాధితుడైన 64 ఏళ్ల కొండబాబు కోలుకుని ఇంటికి చేరారు. ఈ విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. కల్తీ పాలు తాగిన వారిలో అనూరియా, అక్యూట రీనల్ ఫెయిల్యూర్ తదితర లక్షణాలు కనిపించాయి. ఈ ఘటనకు కారణమైన పాల వ్యాపారి ఎ. గణేశ్వరరావును పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.