NTV Telugu Site icon

Raksha Bandhan: సోదరుడికి నిజమైన రక్షాబంధన్‌ కానుక.. ప్రాణాన్ని కాపాడేందుకు కిడ్నీ!

Raksha Bandhan

Raksha Bandhan

Raksha Bandhan: దేశంలో రక్షాబంధన్ వేడుకల సందడి ప్రారంభమైంది. తోడబుట్టినవారికి జీవితాంతం అండగా ఉంటానని సోదరులు హామీ ఇచ్చే రోజు ఇది. అయితే, ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో సోదరుడికి ఓ సోదరి అరుదైన రక్షాబంధన్ కానుక ఇచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న తన అన్న ప్రాణాన్ని కాపాడేందుకు ఒక కిడ్నీని దానం చేసేందుకు సిద్ధమైంది. కిడ్నీల వైఫల్యంతో బాధపడుతున్న సోదరుడికి తన కిడ్నీని ఇచ్చేందుకు రెడీ అయ్య అందరి ప్రశంసలు అందుకుంటోంది ఆ మహిళ. సోదరుడికి రక్షాబంధన్ కానుక అన్నట్లుగా.. శరీరంలోని ఓ భాగాన్నే దానం చేస్తోంది.

Also Read: China: చైనా మ్యాపులపై భారత్ అభ్యంతరం.. స్పందించిన డ్రాగన్ కంట్రీ..

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఓ మహిళ తన సోదరుడి ప్రాణాలను కాపాడేందుకు తన కిడ్నీని దానం చేయాలని నిర్ణయించుకుంది. ఓంప్రకాష్ ధంగర్ (48) అనే వ్యక్తి గత ఏడాది మే నుంచి దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. అతని కిడ్నీలు డయాలసిస్ చేయాల్సిన స్థాయికి క్షీణించాయి. ఒక కిడ్నీ 80 శాతం, మరొకటి 90 శాతం దెబ్బతిన్నాయి. చాలా టెస్టుల తర్వాత అతని కుటుంబం గుజరాత్‌లోని నాడియాడ్‌లోని ఆసుపత్రిలో అతనికి కిడ్నీ మార్పిడి చేయాలని నిర్ణయించుకుంది.

కిడ్నీ దాత అవసరమని కుటుంబీకులకు వైద్యులు చెప్పడంతో రాయ్‌పూర్‌లోని తిక్రపారా నివాసి ఓంప్రకాష్ అక్క షీలాబాయి పాల్ వెంటనే స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఆమెకు అవసరమైన అన్ని పరీక్షలు నిర్వహించబడ్డాయి. ఆమె కిడ్నీ సరిగ్గా సరిపోతుందని వైద్యులు వెల్లడించారు. సెప్టెంబర్ 3న కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరగనుంది. ఓంప్రకాష్, షీలాబాయి ఇద్దరూ ప్రస్తుతం గుజరాత్‌లో ఉన్నారు. శస్త్రచికిత్సకు సిద్ధమవుతున్నారు.షీలాబాయి తన సోదరుడిని ప్రేమించి, ఆయురారోగ్యాలతో జీవించాలని తమ్ముడి కోసం ఇలా చేస్తున్నానని చెప్పింది. షెడ్యూల్ చేయబడిన కిడ్నీ మార్పిడికి వారం ముందు, షీలాబాయి ఓం ప్రకాష్‌కు తన భద్రత కోసం ప్రతిజ్ఞగా రాఖీని కట్టింది.