భారతదేశంలో దసరా, దీపావళి పండుగలను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ పండగల కోసం ప్రజలు తమ సొంతూర్లకు వెళ్లి కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో కలిసి వేడుకలు చేసుకుంటారు. ఈ క్రమంలో.. ఎక్కువ శాతం ప్రజలు ప్రయాణం చేస్తారు. పండుగల కోసం ఇంటికి వెళ్తున్న ప్రయాణికులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. పండుగల సీజన్ సమీపిస్తున్న తరుణంలో.. దుర్గాపూజ, దీపావళి, ఛత్ పండుగల కోసం ప్రయాణికులు తమ సొంత గ్రామాలకు వెళ్తారు. ఈ క్రమంలో.. భారతీయ రైల్వే దాదాపు 6,000 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. అంతేకాకుండా.. 108 రైళ్లకు అదనపు జనరల్ కోచ్‌లు జత చేశారు. పండుగల సమయంలో కనిపించే అదనపు రద్దీని తగ్గించడానికి 12,500 కోచ్‌లను మంజూరు చేసినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
Read Also: Tiger Robi: భారత్-బంగ్లాదేశ్ రెండో టెస్ట్ మ్యాచ్.. బంగ్లా అభిమానిపై దాడి..!
దుర్గాపూజ, దీపావళి, ఛత్ పండుగల సమయంలో ఎక్కువగా బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లకు వెళ్లే మార్గాల్లో భారీ రద్దీ ఉంటుంది. ఈ ఏడాది ఫెస్టివల్ సీజన్‌కు సంబంధించి ఇప్పటివరకు మొత్తం 5,975 ప్రత్యేక రైళ్లను నోటిఫై చేశామని.. గత ఏడాది 4,429 ప్రత్యేక రైళ్లను నడిపించామని అశ్విని వైష్ణవ్ తెలిపారు. “ఈ పండగల సమయంలో కోటి మందికి పైగా ప్రయాణికులు ఇంటికి వెళ్ళడానికి ఇది సులభతరం చేస్తుంది” అని ఆయన చెప్పారు. దుర్గాపూజ అక్టోబర్ 9 న ప్రారంభమవుతుంది.. దీపావళి అక్టోబర్ 31న జరుపుకోనున్నారు. ఛత్ పూజ నవంబర్ 7, 8 తేదీలలో జరుగుతుంది. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని దసరా, దీపావళి పండుగలకు మాత్రమే కాకుండా సంక్రాంతి, వినాయక చవితి వంటి పండుగలకు, కుంభమేళా వంటి సమయాలలో కూడా విశేషంగా సేవలను అందిస్తూ ప్రత్యేక రైళ్లను నడుపుతూ భారతీయ రైల్వే ప్రజల అవసరాలను తీరుస్తుంది.
Read Also: Yemen-Israel: ఇజ్రాయెల్‌పై ప్రతీకారం..! యెమెన్ తిరుగుబాటుదారులు దాడి