Rahul Gandhi: బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమరం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలు రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీహార్ ఓట్ల తొలగింపుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని టార్గెట్ గా చేసుకొని విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఆయన ఇవాళ్టి (ఆగస్టు 17) నుంచి బీహార్‌లో యాత్ర చేపట్టనున్నట్లు పార్టీ అధిష్టానం స్పష్టం చేసింది. ఈ యాత్రకు ‘ఓటర్ అధికార్ యాత్ర’ అని పేరు పెట్టినట్లు చెప్పుకొచ్చారు.
రోహ్తాస్ నుంచి యాత్ర ప్రారంభం..
బీహార్ రాష్ట్రంలో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ఈ ‘ఓటర్ అధికార్ యాత్ర’ చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఆయన రాష్ట్రంలో 16 రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ సమయంలో ఆయన 24 జిల్లాల్లో పర్యటించనున్నారు. కాగా, యాత్రకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. సెప్టెంబర్ 1వ తేదీన పాట్నాలో జరిగే ర్యాలీతో ‘ఓటు అధికార్ యాత్ర’ ముగుస్తుందన్నారు. యాత్రలో ఇండియా కూటమిలోని అన్ని పార్టీల సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారని తెలిపారు. రాహుల్ గాంధీ తన యాత్రను ససారాం నుంచి ప్రారంభిస్తారని ఎంపీ అఖిలేష్ ప్రసాద్ సింగ్ అన్నారు. ఈ యాత్రకు సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకున్నట్లు చెప్పారు. బీహార్ ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్, వామపక్ష పార్టీలు సహా ఇతర కూటమి పార్టీల సభ్యులు కూడా రాహుల్ గాంధీతో కలిసి నడిచే అవకాశం ఉంది.
Read Also: Shubhanshu Shukla: భారత్ మాతా కీ జై అంటూ.. శుభాంశు శుక్లాకు ఘన స్వాగతం
ఓట్ల చోరీకి వ్యతిరేకంగా..
ఇక, రాహుల్ గాంధీ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. రేపటి (ఆగస్టు 17) నుంచి జరిగే ‘ఓటర్ అధికార్ యాత్ర’తో బీహార్ నుంచి ఓటు దొంగతనానికి వ్యతిరేకంగా తాము ప్రత్యక్ష పోరాటం చేయబోతున్నాస్తామని అన్నారు. ఇది కేవలం ఎన్నికల సమస్య కాదు, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ‘ఒక వ్యక్తి, ఒక ఓటు’ అనే సూత్రాన్ని రక్షించడానికి చేయనున్న ఒక నిర్ణయాత్మక యుద్ధమని అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడటానికి బీహార్ యువత తమతో పాటు వస్తారని పేర్కొన్నారు. యువతందరూ వచ్చి తమతో చేరి రాజ్యాంగాన్ని రక్షించాలని ఆయన పిలుపునిచ్చారు.
