Rahul Gandhi: తెలంగాణతో మాకు కుటుంబ సంబంధం ఉందని, రాజకీయ సంబంధం కాదని రాహుల్ గాంధీ అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాటారంలో ఇవాళ ఉదయం జరిగిన సభలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ప్రసంగించారు. రాహుల్ గాంధీ ఈ ఉదయం భూపాలపల్లి నుంచి బస్సులో కాటారం చేరుకున్నారు. కాంగ్రెస్ బస్సు యాత్ర రెండో రోజు ఉదయం ప్రారంభమైంది. అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తెలంగాణతో మోడీ, కేసీఆర్‌లకు కేవలం రాజకీయ సంబంధమే ఉంది.. మీరంతా ఒక్కసారి గుర్తు పెట్టుకోండి.. మీకు మాకు మధ్య ఉంది రాజకీయ సంబంధం కాదు.. మీ అభిమానం.. ఆశీర్వాదంతో కూడిన సంబంధం.. అందుకే మా చెల్లెను తీసుకు వచ్చా.. ప్రియాంకకి చెప్పా తెలంగాణతో మనకు రాజకీయ సంబంధం కాదు.. కుటుంబ సంబంధం అని చెప్పి తీసుకు వచ్చా రాహుల్ గాంధీ సెంటి మెంట్ డైలాగ్స్ చెప్పారు. దొరల తెలంగాణకి.. ప్రజల తెలంగాణ మధ్య యుద్ధం.. దొర ఇలాకాలో మనకీ మంచి రోజులు వచ్చాయి అనిపిస్తుందన్నారు.
కేసీఆర్ కుటుంబం తెలంగాణ సంపదను లూటీ చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలో మహిళలందరూ ఫ్రీగా బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు.. నేను అబద్ధం చెప్పను.. పనికి మాలిన మాటలు చెప్పనని అన్నారు. కేసీఆర్‌లా 3 ఎకరాల భూమి ఇస్తాం లాంటి హామీలు ఇవ్వడానికి రాలేదన్నారు. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని, మహిళలు ఎక్కడికి వెళ్లినా ఉచిత బస్సు ప్రయాణమని హామీ ఇచ్చారు. దేశ సంపదలో పేదలకు వాటా ఇస్తామన్నారు. దేశంలో 5 శాతం ఓబీసీ అధికారులు ఉంటే ఆ వర్గాలకు ఎలా న్యాయం జరుగుతుందన్నారు. కులాల వారీగా జన గణన చేస్తామన్నారు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో కుల జన గణన చేయండి అని అదేశించామన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే కులాల వారీగా జన గణన చేస్తామన్నారు. దేశంలో బడా వ్యాపారులకు అప్పులు మాఫీ చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల రుణాలు ఎందుకు మాఫీ చేయలేదు..? రైతులు రుణం చెల్లించకపోతే బయటకు గెంటి వేస్తున్నారని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ అవినీతిపై బీజేపీ ఎందుకు విచారణ చేయడం లేదని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతిపై ఈడీ, సీబీఐ ఎందుకు దృష్టి సారించలేదన్నారు. కేసీఆర్ తన అవినీతిని పక్క రాష్ట్రాలకు కూడా విస్తరింపజేశారని ఆరోపించారు.తెలంగాణలో దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం ఉందని రాహుల్ గాంధీ ఆరోపించారు. కేసీఆర్ సర్కార్ అవినీతి వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అవినీతికి పాల్పడుతున్న కేసీఆర్ పై చర్యలు తీసుకోలేదన్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం తనపై ఇరవైకి పైగా కేసులు నమోదు చేసిందని గుర్తు చేశారు. మీ ఉత్సాహం చూస్తుంటే తెలంగాణలో కేసీఆర్ ఓటమి ఖాయం.
MLC Kavitha: ప్రియాంక గాంధీ పై కవిత సెటైర్.. మీరేనా ఫ్యామిలీ పాలిటిక్స్ గురించి మాట్లాడేది..!