Rahul Gandhi Reveals Dating Story: తన తల్లిదండ్రులు ప్రేమలో పడిన రెస్టారెంట్‌కే గర్ల్‌ఫ్రెండ్‌ను తీసుకెళ్లిన రాహుల్ గాంధీ.. ఆసక్తికర విషయాలు!

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi Reveals Dating Story: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన తల్లి, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ రచించిన ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్.. తన తల్లిదండ్రుల ప్రేమకథతో పాటు కాలేజీ రోజుల్లో తనకు ఎదురైన ఓ అనుభవాన్ని పంచుకున్నారు. ముఖ్యంగా తన మాజీ ప్రేయసితో కలిసి వెళ్లిన రెస్టారెంట్ గురించి చెప్పిన విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. విషయం ఏంటంటే..? రాహుల్ గాంధీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుతున్న సమయంలో తన గర్ల్‌ఫ్రెండ్‌ను ఓ రెస్టారెంట్‌కు తీసుకెళ్లారట. ఆ రెస్టారెంట్ ప్రత్యేకత ఏమిటంటే.. అక్కడే తన తల్లిదండ్రులు సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ తొలిసారి కలుసుకున్నారు. బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్‌లో ఉన్న ‘వర్సిటీ రెస్టారెంట్’లోనే వారిద్దరి పరిచయం ప్రేమగా మారిందని కుటుంబంలో తరచూ చెప్పుకునేవారని ఈ సందర్భంగా రాహుల్ గుర్తుచేసుకున్నారు.

చాలా ఏళ్ల తర్వాత తాను కూడా అదే నగరంలో చదువుకుంటున్న సమయంలో తన గర్ల్‌ఫ్రెండ్‌ను అక్కడికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అయితే ఆ రెస్టారెంట్ వెనుక ఉన్న తన తల్లిదండ్రుల ప్రేమకథ గురించి ఆమెకు తెలియదని చెప్పారు. అక్కడికి వెళ్లిన తర్వాత తన తల్లిదండ్రులు ఇదే రెస్టారెంట్‌లో కలుసుకున్నారని సిబ్బందికి చెప్పగా.. అక్కడున్న వ్యక్తి వారిద్దరూ తనకు తెలుసంటూ బదులిచ్చారని నవ్వుతూ చెప్పుకొచ్చారు రాహుల్‌ గాంధీ.. అంతేకాకుండా రెస్టారెంట్‌లో ఏం తినాలో అడిగితే ‘చికెన్ చస్సూర్’ బాగుంటుందని సిబ్బంది సూచించారట. దీంతో ఇద్దరూ అదే ఆర్డర్ చేశారని, అయితే ఆ వంటకం మాత్రం ఏమాత్రం బాగోలేదని రాహుల్ చమత్కరించారు. ప్రేమలో పడాలనుకునేవారు వర్సిటీ రెస్టారెంట్‌కు వెళ్లొచ్చని, కానీ అక్కడ మాత్రం చికెన్ చస్సూర్ తినకూడదని సరదాగా వ్యాఖ్యానించారు. రాహుల్‌ వ్యాఖ్యలతో ఆ కార్యక్రమంలో నవ్వులు విరిశాయి.

ఇక, తన తల్లిదండ్రులకు మాత్రం ఆ రెస్టారెంట్‌లో భోజనం అద్భుతంగా గుర్తుండిపోయిందని, కానీ తనకు మాత్రం అక్కడి ఆహారం అంతగా నచ్చలేదని రాహుల్ పేర్కొన్నారు. ప్రస్తుతం తన మాజీ ప్రేయసితో ఎలాంటి సంబంధం ఉందని అడిగిన ప్రశ్నకు.. తామిద్దరం ఇప్పుడు స్నేహితులమని సమాధానమిచ్చారు. దీంతో సోనియా, రాజీవ్ ప్రేమకథతో పాటు రాహుల్ కాలేజీ రోజుల జ్ఞాపకాలు కూడా ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.