తెలంగాణలో కాంగ్రెస్ చేపట్టిన బస్సుయాత్రలో ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేడు మోర్తాడులో ఆయన మాట్లాడుతూ.. ఇవి దొరల తెలంగాణకు ప్రజా తెలంగాణకు మధ్య జరుగుతున్న ఎన్నికలు అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల సొమ్మును కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని, శాండ్, ల్యాండ్, మైన్ ఏ దందాలో చూసినా కేసీఆర్ కుటుంబం దోపిడీ కనిపిస్తుందన్నారు. నేను అబద్ధపు వాగ్దానాలు చేయడానికి ఇక్కడకు రాలేదని, ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని మాట ఇవ్వడానికి వచ్చానన్నారు రాహుల్ గాంధీ.
అంతేకాకుండా.. ‘రాజస్థాన్, ఛత్తీస్ గడ్, కర్ణాటకలో ఇచ్చిన హామీలు అమలు చేసి చూపించా. తెలంగాణలో అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను అమలు చేస్తుంది. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతీ నెలా మహిళలకు రూ. 2500 అందిస్తాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తాం. రైతులకు, కౌలు రైతులకు ఏడాదికి రూ.15వేలు అందిస్తాం. పసుపు రైతులకు క్వింటాకు రూ.12వేలు ధర కల్పిస్తాం. గృహ జ్యోతి ద్వారా ప్రతీ ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తాం. కేసీఆర్ మీ నుంచి దోచుకున్న డబ్బును సంక్షేమం రూపంలో మీకు పంచనున్నాం.
తెలంగాణలో దొరలపాలనను సాగనంపి… ప్రజా తెలంగాణను ఏర్పాటు చేసుకుందాం. మీతో నాకున్న అనుబంధం రాజకీయ అనుబంధం కాదు.. కుటుంబ అనుబంధం.. నెహ్రూ, ఇందిరమ్మ నాటి నుంచి ఈ బంధం కొనసాగుతోంది. మహారాష్ట్ర, అస్సాం, రాజస్థాన్… మేం ఎక్కడ బీజేపీ తో యుద్ధం చేస్తే.. అక్కడ ఎంఐఎం అభ్యర్థులను పోటీకి దింపుతోంది. బీజేపీతో పోరాడుతున్నందుకు నాపై కేసులు పెట్టారు.. లోక్ సభ సభ్యత్వం రద్దు చేశారు.. ఇల్లు లేకుండా చేశారు.. నాకు ఇల్లు లేకుండా చేయగలిగారేమో కానీ… కోట్లాది భారతీయుల హృదయాల నుంచి బయటకు పంపలేరు.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం.. ప్రజా తెలంగా ఆ ఏర్పడటం ఖాయం.’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
