Rahul Gandhi: అమిత్ షా పరువు నష్టం కేసులో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సుల్తాన్ పూర్ కోర్టు భారీ ఊరటనిచ్చింది. ఈ కేసులో ఆయనను నిర్దోషిగా తేలుస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. 2018 నాటి ఈ వివాదానికి సంబంధించి సుల్తాన్ పూర్ ప్రత్యేక ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు ఈ కీలక తీర్పును వెలువరించింది. ఈ తీర్పు కోసం రాహుల్ గాంధీ స్వయంగా కోర్టుకు కూడా హాజరయ్యారు. ఈ కేసులో కోర్టు నిర్దోషిగా ప్రకటించినట్లు ఆయన తరఫు న్యాయవాది కాశీ ప్రసాద్ శుక్లా తెలిపారు. కేసు పూర్తి వివరాలను పరిశీలిద్దాం..
2018లో వివాదాస్పద వ్యాఖ్యలు..
కర్ణాటక ఎన్నికల సమయంలో 2018 మే 8న బెంగళూరులో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ నాటి బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఆగస్టు 4న బీజేపీ నేత, జిల్లా సహకార బ్యాంకు మాజీ అధ్యక్షుడు విజయ్ మిశ్రా రాహుల్ గాంధీపై పరువు నష్టం దావా వేస్తూ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ కేసును విచారించిన కోర్టు 2023 నవంబర్ 27న విచారణకు హాజరుకావాలని రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది. ఆ తర్వాత 2024 ఫిబ్రవరి 20న రాహుల్ గాంధీ స్వయంగా కోర్టులో హాజరై లొంగిపోవడంతో బెయిల్ లభించింది. అయితే రాహుల్ వాయిస్ శాంపిల్స్‌ను పోల్చాలని ఫిర్యాదుదారు విజయ్ మిశ్రా కోరారు. అదే ఏడాది జూలై 26న రాహుల్ గాంధీ కోర్టులో తన వాంగ్మూలాన్ని నమోదు చేయగా, అక్టోబర్ 9న ఫిర్యాదుదారు విజయ్ మిశ్రా వాంగ్మూలాన్ని రికార్డు చేశారు.
2025లో సాక్షుల విచారణ..
2025 ఫిబ్రవరి 28న ఫిర్యాదుదారు వైపు నుంచి సాక్షి అయిన అనిల్ మిశ్రా వాంగ్మూలం నమోదైంది. ఆ తర్వాత అదే ఏడాది డిసెంబర్ 8న రెండో సాక్షి రామచంద్ర దూబే వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది. ఇక, ఈ ఏడాది ఫిబ్రవరి 20న సీఆర్పీసీ సెక్షన్ 313 కింద రాహుల్ గాంధీ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. మార్చి 12న రాహుల్ వాయిస్ శాంపిల్స్ మ్యాచింగ్ కోసం ఫిర్యాదుదారు విజయ్ మిశ్రా కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. మే 21న మేజిస్ట్రేట్ కోర్టు ఈ అర్జీని కొట్టేయడంతో, ఆయన సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. జూలై 15న ఏడీజే కోర్టు కూడా ఆయన పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో సెప్టెంబర్ 10న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, న్యాయమూర్తి సుభాష్ విద్యార్థి దానిని కూడా కొట్టివేశారు. అక్టోబర్ 6న ఈ కేసులో వాదనలు ప్రారంభమై, అక్టోబర్ 12 నాటికి విచారణ పూర్తయింది. చివరకు ఆరు సంవత్సరాల కిందటి ఈ పరువు నష్టం కేసులో విచారణ ముగియడంతో, సుల్తాన్ పూర్ ప్రత్యేక ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు రాహుల్ గాంధీని నిర్దోషిగా ప్రకటిస్తూ తుది తీర్పు వెలువరించింది.

