NTV Telugu Site icon

Rafael Nadal Retirement: పరాజయంతో కెరీర్‌ను ముగించిన ‘స్పెయిన్ బుల్’!

Rafael Nadal Retirement

Rafael Nadal Retirement

స్పెయిన్ బుల్, టెన్నిస్ దిగ్గజం రఫెల్‌ నాదల్ కెరీర్‌ ముగిసింది. డేవిస్ కప్‌ 2024లో నెదర్లాండ్స్ చేతిలో స్పెయిన్ 2-1 తేడాతో ఓటమిపాలవ్వడంతో రఫా తన కెరీర్‌ను ముగించాడు. ముందుగా సింగిల్స్‌లో ఓడగా.. ఇప్పుడు నెదర్లాండ్స్ జట్టు ఓడిపోవడంతో నాదల్‌కు ఆడే ఛాన్స్ దొరకలేదు. డేవిస్ కప్‌తో ఆటకు వీడ్కోలు పలుకుతానని గత అక్టోబర్‌లోనే రఫా ప్రకటించిన విషయం తెలిసిందే. రెండు దశాబ్దాలకు పైగా టెన్నిస్‌లో అద్వితీయ విజయాలు సాధించిన నాదల్.. తన పేరిట ఎన్నో రికార్డులు లిఖించుకున్నాడు.

రఫెల్‌ నాదల్ తన తొలి సింగిల్స్‌ మ్యాచ్‌లో ఓడిపోయాడు. నెదర్లాండ్స్‌ ఆటగాడు బొటిక్‌ వాన్‌డి జాండ్‌షల్ప్‌ చేతిలో 4-6, 4-6తో వరుస సెట్లలో ఓడిపోయాడు. స్పెయిన్ ప్లేయర్ కార్లోస్ అల్కారజ్ సింగిల్స్‌ మ్యాచ్‌లో విజయం సాధించినా.. అల్కారజ్, మార్సెల్ గ్రానోల్లర్స్‌ ద్వయం ఓటమితో డేవిస్ కప్‌లో స్పెయిన్ పోరాటం ముగిసింది. దాంతో రఫా కెరీర్‌కు ఎండ్ కార్డు పడింది. కొంతకాలంగా గాయాలతో సతమతమవుతున్న నాదల్‌.. 2024లో నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో ఒకటి మాత్రమే ఆడాడు. డేవిస్ కప్‌కు ముందు ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో నిరాశపరిచాడు.

Also Read: IPL 2025 Auction: ఆ భారత ఆటగాడిపై కన్నేసిన ఆర్‌సీబీ, సీఎస్‌కే.. కోట్ల వర్షమే ఇక!

రఫెల్ నాదల్ తన కెరీర్‌లో 22 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు సాధించాడు. ఇందులో 14 ఫ్రెంచ్ ఓపెన్, రెండు వింబుల్డన్, నాలుగు యూఎస్ ఓపెన్, రెండు ఆస్ట్రేలియన్ ఓపెన్‌ టైటిళ్లు ఉన్నాయి. ‘క్లే కింగ్’గా పేరుగాంచిన నాదల్ వీడ్కోలు సమయంలో భావోద్వేగానికి గురయ్యాడు. ‘ఈరోజు నా జీవితంలో అత్యంత భావోద్వేగమైన రోజు. ప్రొఫెషనల్ టెన్నిస్‌లో చివరి సింగిల్స్‌ మ్యాచ్‌ ఆడేశా. చివరిసారిగా జాతీయ గీతాలాపన చేయడం ప్రత్యేకంగా ఉంది. నా కెరీర్‌లో సాదించిన టైటిళ్లతో నన్ను గుర్తు పెట్టుకుంటారు. చిన్న గ్రామం నుంచి వచ్చిన నన్ను ఓ మంచి వ్యక్తిగా గుర్తుపడితే ఆనందంగా ఉంటుంది. ఎప్పుడూ అండగా నిలిచిన మా కుటుంబానికి ధన్యవాదాలు’ అని నాదల్ పేర్కొన్నాడు.