సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడింది. త్వరలోనే దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు సన్నద్ధమయ్యాయి. అధికార బీజేపీ పార్టీ ఇప్పటికే 195 మందితో కూడిన తొలి జాబితాను విడుదల చేసేసింది. మరో జాబితా కూడా త్వరలోనే విడుదల చేయనుంది. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా రంగంలోకి దిగింది. గురువారం అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో అగ్ర నేతలు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా అభ్యర్థుల ఎంపికపై మేథోమదనం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే (Mallikarjun kharge) ఈసారి ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన పదవి కూడా ఇంకో నాలుగేళ్లు ఉంది. పైగా ఆయన వయసు 81 ఏళ్లు. దీంతో వయసు రీత్యా ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే గత ఎన్నికల్లో కర్ణాటక గుల్బర్గా నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అంతకముందు రెండు సార్లు అదే నియోజకవర్గం నుంచి ఖర్గే గెలుపొందారు. కానీ గత ఎన్నికల్లో మాత్రం ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
ఖర్గే ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలగుతున్న నేపథ్యంలో గుల్బర్గా లోక్‌సభ స్థానంలోకి (Gulbarga) ఆయన అల్లుడు రాధాకృష్ణ దొడ్డమణి (Radhakrishna doddamani) రేసులోకి వచ్చారు. దొడ్డమణి స్థానిక నేత కావడం. పైగా అక్కడనే ఆయనకు పలు విద్యాసంస్థలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దొడ్డమణికి సీటు ఇస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. దీంతో గుల్బర్గా సీటును ఖర్గే అల్లుడికి కేటాయించాలని ప్రతిపాదన వచ్చినట్లు పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. కాంగ్రెస్ అగ్ర నేతలతో ఖర్గే చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

ఇక చిత్తాపూర్ అసెంబ్లీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే.. కర్ణాటకలోని సిద్ధరామయ్య కేబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. దీంతో ఆయన లోక్‌సభ రేసులో వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదని సమాచారం. దీంతో ఖర్గే అల్లుడు పేరు చర్చలోకి వచ్చింది. తొలుత పోటీపై దొడ్డమణి విముఖత చూపించినా.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆయన సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే దొడ్డమణి ఇప్పటి వరకు తన మామ ఖర్గేకు వెనుకుండి ప్రచారం నిర్వహించేవారు. వ్యూహ రచనలో చురుకుగా పని చేశారు. పోల్ మేనేజ్‌మెంట్ చేయడంలో మంచి పేరుంది. ఇక 1972-2004 మధ్య ఖర్గే వరుసగా ప్రాతినిధ్యం వహించిన గుర్మిత్‌కల్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో పార్టీ కార్యకర్తలు, మద్దతుదారుల్లో దొడ్డమణి మంచి ప్రజాదరణ పొందారు. ఇవన్నీ కూడా ఆయనకు కలిసొచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.