NTV Telugu Site icon

Rachakonda CP: ర్యాపిడో, ఓలా, ఉబేర్ ద్వారా హెరాయిన్ డ్రగ్ సరఫరా..

Drugs

Drugs

Rachakonda CP: రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు నేతృత్వంలో డ్రగ్ మాఫియాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సైనిక్‌పురిలో గ్యాస్ వ్యాపారం ముసుగులో హెరాయిన్ డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గ్యాస్ స్టవ్ విడిభాగాల ముసుగులో ఈ ముఠా హెరాయిన్‌ను సరఫరా చేస్తుండగా.. కన్స్యూమర్లకు ర్యాపిడో, ఓలా, ఉబేర్ వంటి రవాణా సేవల ద్వారా డ్రగ్స్ అందజేస్తున్నారని విచారణలో వెల్లడైందని కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. ఈ ముఠా చాలా కాలంగా డ్రగ్స్ సరఫరా చేస్తోందని ఆయన తెలిపారు. స్టూడెంట్స్‌ను టార్గెట్ చేస్తూ, ముందుగా వారికి డ్రగ్స్ పట్ల ఆసక్తి కలిగించడంతో మొదలుపెట్టి తరువాత డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు నిర్ధారించారు.

ఇకపోతే గత ఏడాది నుండి ఇప్పటివరకు రాచకొండ పోలీసులు రూ. 88 లక్షల 33 వేల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 2437 కిలోల గంజాయి, 277 గ్రాముల ఎండీఎంఏ, 23 గ్రాముల హెరాయిన్, 96 కిలోల పాపిస్ట్రా, 27 కిలోల హాషిష్ ఆయిల్, 4 కిలోల ఓపియం సీజ్ చేశామని సుధీర్ బాబు తెలిపారు. డ్రగ్ పెడ్లర్లను పట్టుకోవడం వల్ల కొత్త కొత్త రూట్ల ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు అధికారులు. దీనిని అడ్డుకోవడంలో భాగంగా ఓలా, ఉబేర్ వంటి సంస్థలతో ప్రత్యేక మీటింగ్‌లు నిర్వహించనున్నామని సీపీ తెలిపారు. డ్రగ్స్ రవాణా చేస్తున్న వ్యక్తులకు తెలియకుండా.. రైడర్ల ద్వారానే సరఫరా జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ఇక రాచకొండ పోలీసులు నిన్నటి కాల్పుల ఘటనకు సంబంధించి నిందితుల కోసం కూడా గాలిస్తున్నారు. ఈ డ్రగ్ ముఠాలపై మరింత కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేశారు అధికారులు. పోలీసుల ప్రయత్నాలతో డ్రగ్ మాఫియాకు చెక్ పెడుతూ, నగరంలో శాంతి భద్రతలను పటిష్ఠంగా నిలబెట్టేందుకు కృషి జరుగుతోంది.