NTV Telugu Site icon

Afghanistan Coach: ఆఫ్ఘనిస్తాన్‌ అసిస్టెంట్‌ కోచ్‌గా టీమిండియా మాజీ కోచ్‌!

R Sridhar

R Sridhar

ఆఫ్ఘనిస్తాన్‌ క్రికెట్‌ జట్టు అసిస్టెంట్‌ కోచ్‌గా భారత జట్టు మాజీ ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌ శ్రీథర్‌ నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. న్యూజిలాండ్‌తో జరగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్, దక్షిణాఫ్రికాతో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు శ్రీథర్‌ అసిస్టెంట్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. శ్రీథర్‌ పని తీరును బట్టి ఒప్పందంపై ఆఫ్ఘనిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు నిర్ణయం తీసుకోనుంది.

‘న్యూజిలాండ్‌తో ఏకైక టెస్టు, దక్షిణాఫ్రికాతో జరిగే 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు సహాయ కోచ్‌గా ఆర్ శ్రీధర్‌ను నియమించాం. శ్రీధర్ తన పాత్రను సమర్థవంతంగా నిర్వర్తించాలని, భవిష్యత్తులో అతనితో దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకోవాలని బోర్డ్ కోరుకుంటోంది’ అని ఆఫ్ఘనిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు పేర్కొంది. ఆఫ్ఘనిస్తాన్‌ హెడ్‌ కోచ్‌ జోనాథన్‌ ట్రాట్‌ అండర్‌లో శ్రీధర్‌ పని చేయనున్నారు. సెప్టెంబర్‌ 9 నుంచి ఆఫ్ఘనిస్తాన్‌, న్యూజిలాండ్‌ ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌ నోయిడాలో జరగనుంది.

Also Read: Rohit Sharma-Shreyas: రోహిత్‌కు సీటు ఇచ్చిన శ్రేయస్‌.. వీడియో వైరల్‌!

54 ఏళ్ల శ్రీథర్‌ 2021 టీ20 వరల్డ్‌కప్‌ వరకు రవిశాస్త్రి అండర్‌లో భారత జట్టు ఫీల్డింగ్‌ కోచ్‌గా పని చేశారు. 2008-14 వరకు నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో అసిస్టెంట్‌ ఫీల్డింగ్‌ మరియు స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌గా ఉన్నారు. 2014 ఇండియా అండర్‌-19 వరల్డ్‌కప్‌ స్క్వాడ్‌కు అసిస్టెంట్‌ కోచ్‌గా వ్యవహరించారు. 1989-2001 మధ్య దేశవాళీ క్రికెట్‌లో హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించారు. హైదరాబాద్ తరపున 35 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు, 15 లిస్ట్ ఏ మ్యాచ్‌లు ఆడారు.