NTV Telugu Site icon

Pakistan Captain: ఒక్క అంతర్జాతీయ మ్యాచ్‌ కూడా ఆడకుండా.. ఏకంగా పాకిస్తాన్‌ కెప్టెన్‌ అయ్యాడు!

Qasim Akram Pakistan Captain

Qasim Akram Pakistan Captain

Pakistan Squad For Asian Games 2023: చైనా వేదికగా జరగనున్న ఆసియా క్రీడలు 2023 కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) గురువారం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్‌ కూడా ఆడని ఖాసిం అక్రమ్‌ కెప్టెన్‌గా (Qasim Akram Pakistan Captain) ఎంపికయ్యాడు. సీనియర్లు ఉన్నా.. 20 ఏళ్ల అక్రమ్‌కు కెప్టెన్సీ దక్కడం విశేషం. అక్టోబర్‌ నుంచి 5 నుంచి వన్డే ప్రపంచకప్ 2023 జరగనున్న నేపథ్యంలో ఆసియా క్రీడలకు భారత్ మాదిరే ద్వితీయ శ్రేణి జట్టును పాకిస్తాన్ సెలక్టర్లు ఎంపిక చేశారు. ఏషియన్‌ గేమ్స్‌ సెప్టెంబర్‌ 23 నుంచి ఆక్టోబర్‌ 8 వరకు జరగనున్నాయి.

ఆసియా క్రీడలు 2023 కోసం అంతర్జాతీయ అనుభవం ఉన్న ఎనిమిది మంది క్రికెటర్లు, యువకులతో కూడిన బలమైన జట్టును పాకిస్తాన్ సెలక్టర్లు ఎంపిక చేశారు. ఈ జట్టుకు ఖాసిం అక్రమ్‌ నాయకత్వం (Qasim Akram to lead Pakistan Team) వహించనుండగా.. ఒమైర్ బిన్ యూసుఫ్ ఖాసిమ్ డిప్యూటీగా ఎంపికయ్యాడు. అక్రమ్‌తో పాటు అరాఫత్ మిన్హాస్, సుఫియాన్ ముఖీమ్, మీర్జా తాహిర్ బేగ్, ఓమైర్‌ బిన్ యూసుఫ్, రోహైల్ నజీర్, ముహమ్మద్ అఖ్లాక్‌లకు తొలిసారి జట్టులో చోటు దక్కింది. మరోవైపు ఆసిఫ్ అలీ, హైదర్ అలీ, మహ్మద్ హస్నైన్, షానవాజ్ దహానీ, ఉస్మాన్ ఖాదిర్ వంటి సీనియర్లు ఉన్నారు.

Also Read: Babar Azam: చరిత్ర సృష్టించిన బాబర్‌ ఆజమ్‌.. ప్రపంచ క్రికెట్‌లో తొలి క్రికెటర్‌గా! కింగ్ కోహ్లీ వల్ల కూడా కాలేదు

20 ఏళ్ల ఖాసిం అక్రమ్‌కు దేశీవాళీ క్రికెట్‌లో మంచి రికార్డు ఉంది. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో సెంట్రల్‌ పంజాబ్‌ జట్టు తరపున ఆడుతున్నాడు. అక్రమ్‌ మంచి ఆల్‌రౌండర్‌. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఇప్పటివరకు 20 మ్యాచ్‌లు ఆడి.. 27 వికెట్లు, 960 పరుగులు చేశాడు. లిస్ట్‌-ఏ క్రికెట్‌లో 45 మ్యాచ్‌లు ఆడి.. 1305 పరుగులు సాధించాడు. అండర్‌-19 ప్రపంచకప్ 2022లో పాకిస్థాన్‌కు అక్రమ్‌ నాయకత్వం వహించాడు. ఇటీవల జరిగిన ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2023 విజేతగా పాక్‌ నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే అతడికి పాకిస్తాన్ సెలక్టర్లు జట్టు పగ్గాలు అప్పగించారు.

పాకిస్థాన్ జట్టు:
ఖాసిం అక్రమ్ (కెప్టెన్), ఒమైర్ బిన్ యూసుఫ్ (వైస్ కెప్టెన్), అమీర్ జమాల్, అరాఫత్ మిన్హాస్, అర్షద్ ఇక్బాల్, ఆసిఫ్ అలీ, హైదర్ అలీ, ఖుష్దిల్ షా, మీర్జా తాహిర్ బేగ్, మహ్మద్ హస్నైన్, ముహమ్మద్ అఖ్లాక్ (కీపర్), రోహైల్ నజీర్, షానవాజ్ దహానీ, సుఫియాన్ ముఖీమ్, ఉస్మాన్ ఖాదిర్.
నాన్-ట్రావెలింగ్ రిజర్వ్‌లు:
అబ్దుల్ వాహిద్ బంగల్జాయ్, మెహ్రాన్ ముంతాజ్, మొహమ్మద్ ఇమ్రాన్ జూనియర్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్ నియాజీ, ముబాసిర్ ఖాన్