Site icon NTV Telugu

Punjab King-IPL: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. మొదటి జట్టుగా..!

Punjab King Ipl

Punjab King Ipl

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో పంజాబ్ కింగ్స్ జట్టు చరిత్ర సృష్టించింది. ఐపీఎల్‌లో అత్యల్ప స్కోర్‌ను డిఫెండ్ చేసిన జట్టుగా పంజాబ్ రికార్డుల్లోకెక్కింది. ఐపీఎల్ 2025లో భాగంగా మంగళవారం ముల్లాన్‌పూర్ వేదికగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 111 పరుగులను కాపాడుకుని.. 16 పరుగుల తేడాతో విజయం సాధించడంతో పంజాబ్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. మరోవైపు అత్యధిక స్కోర్‌ (262)ను ఛేదించిన టీమ్‌గా ఇప్పటికే పంజాబ్ రికార్డ్ సాధించింది. ఈ రెండు రికార్డులను కోల్‌కతాపైనే నెలకొల్పడం ఇక్కడ విశేషం.

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 15.3 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్ అయింది. ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (30; 15 బంతుల్లో 2×4, 3×6) టాప్‌ స్కోరర్‌. కేకేఆర్ బౌలర్లు హర్షిత్‌ రాణా (3/25), వరుణ్‌ చక్రవర్తి (2/21), సునీల్ నరైన్‌ (2/14) రాణించారు. స్వల్ప ఛేదనలో కోల్‌కతా 15.1 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలింది. అంగ్క్రిష్ రఘువంశీ (37; 28 బంతుల్లో 5×4, 1×6) ఒక్కడే రాణించాడు. పంజాబ్ బౌలర్లు యుజ్వేంద్ర చహల్‌ (4/28) చెలరేగగా.. మార్కో జాన్సెన్ (3/17) చెలరేగాడు.

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌పై విజయంతో ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత స్వల్ప స్కోరును కాపాడుకున్న జట్టుగా పంజాబ్‌ కింగ్స్ రికార్డు సృష్టించింది. దాంతో 16 ఏళ్ల చెన్నై సూపర్ కింగ్స్ రికార్డ్‌ను బద్దలు కొట్టింది. 2009లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 116/9 స్కోర్‌ను కాపాడుకుంది. ఈ జాబితాలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (118), పంజాబ్ కింగ్స్‌ (119/8), సన్‌రైజర్స్ హైదరాబాద్ (119/8) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Exit mobile version