Punjab former Deputy Chief Minister OP Soni arrested by state vigilance : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పంజాబ్ మాజీ ఉపముఖ్యమంత్రి ఓపీ సోనీని విజిలెన్స్ బ్యూరో అరెస్ట్ చేసింది. 2016 నుంచి 2022 వరకు అక్రమాస్తులు కూడబెట్టారనే అభియోగాల నేపథ్యంలో ఆయనను అధికారులు అరెస్ట్ చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆదేశాల మేరకు అవినీతికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారం మధ్య ఈ చర్య వచ్చింది. అవినీతి నిరోధక చట్టం ప్రకారం ఓపీ సోనీపై అమృత్‌సర్ రేంజ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు విజిలెన్స్ బ్యూరో అధికారి ఒకరు తెలిపారు. అక్టోబర్ 10, 2022న ఆదేశించిన విచారణను అనుసరించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు చెప్పారు.
Also Read: West Bengal: పంచాయతీ ఎన్నికల్లో హింస.. 600కు పైగా బూత్‌లలో రీపోలింగ్
ఏప్రిల్ 1, 2016 నుంచి మార్చి 31, 2022 వరకు, మాజీ డిప్యూటీ సీఎం, ఆయన కుటుంబ ఆదాయం రూ.4.52 కోట్లు కాగా, వారి ఖర్చు రూ.12.48 కోట్లుగా ఉంది. ఈ వ్యయం వారి ఆదాయ వనరులకు దాదాపు 176.08 శాతం మించిపోయింది.నిందితుడు ఓపీ సోనీ ఈ కాలంలో తన భార్య సుమన్ సోనీ, కుమారుడు రాఘవ్ సోనీ పేరిట ఆస్తులు సంపాదించారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని అధికార ప్రతినిధి తెలిపారు. అవినీతి కేసులో విజిలెన్స్ బ్యూరో చేత అరెస్టు చేయబడిన నాల్గవ కాంగ్రెస్ మాజీ మంత్రిగా ఓపీ సోనీ ఉన్నారు. ఆయన కంటే ముందు భరత్ భూషణ్ ఆశు, సాధు సింగ్ ధర్మోత్, సుందర్ శామ్ అరోరాలు అరెస్టయ్యారు. ఈ మాజీ కాంగ్రెస్ మంత్రులు ప్రస్తుతం పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వంలో కస్టడీలో ఉన్నారు.
