Chandigarh University Row: చంఢీగఢ్ యూనివర్సిటీ వీడియో లీక్ ఘటనపై పంజాబ్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ముగ్గురు మహిళా అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది. ఈ మేరకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసుకు సంబంధించి కాలేజీకి చెందిన విద్యార్థిని సహా ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారి గురుప్రీత్ కౌర్ డియో పర్యవేక్షణలో సిట్ బృందం లోతుగా విచారించనుంది.
యూనివర్సిటీ వీడియో లీక్ ఘటనలో ఇప్పటివరకు మొత్తం ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. స్నానం చేస్తుండగా తానే స్వయంగా రికార్డు చేసుకున్న వీడియోను పంపిన అమ్మాయి, దీన్ని రిసీవ్ చేసుకున్న సిమ్లాకు చెందిన ఆమె లవర్ సన్నీ మెహతాతో పాటు అతని స్నేహితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సహకరించిన హిమాచల్‍ప్రదేశ్ పోలీసులకు పంజాబ్ పోలీసులు ధన్యవాదాలు తెలిపారు. “సిట్ ఈ కేసును లోతుగా విచారించనుంది. ప్రమేయం ఉందని తేలితే ఏ వ్యక్తిని విడిచిపెట్టకూడదు. ఒక విద్యార్థినితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. అద్భుతమైన సహకారం అందించినందుకు హిమాచల్ ప్రదేశ్ డిజీపీకి ధన్యవాదాలు. ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు” అని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ అన్నారు.
చండీగఢ్ యూనివర్శిటీ వర్సిటీ విద్యార్థుల కోసం సెప్టెంబర్ 24 వరకు మూసివేయబడిందని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. మొహాలీలోని చండీగఢ్ విశ్వవిద్యాలయంలోని బాలికల హాస్టల్‌లో పలువురు విద్యార్థినుల అభ్యంతరకర వీడియోలను తోటి హాస్టలర్ రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారన్న ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు భారీ నిరసనలు చేపట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు యూనివర్సిటీలో తమకు భద్రత లేదని కొంతమంది విద్యార్థినులు బ్యాగులు సర్ధుకుని ఇంటిబాట పట్టారు.
Sukhbir Badal: ‘మద్యం మత్తులో ఉన్న సీఎంను విమానం నుంచి దించేశారు..’
హాస్టల్‌లో స్నానం చేస్తుండగా విద్యార్థినులను ఓ విద్యార్థి వీడియో తీశాడని నిరసన విద్యార్థులు ఆరోపించారు. ఆ తర్వాత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలు వైరల్ కావడంతో, హాస్టల్‌లో నివసిస్తున్న విద్యార్థినులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని నిరసన తెలిపిన విద్యార్థులు కూడా పేర్కొన్నారు. అయితే, ఈ ఆత్మహత్య వాదనలన్నింటినీ పోలీసులు తోసిపుచ్చారు. మొహాలీ డిప్యూటీ కమిషనర్ (DC) అమిత్ తల్వార్ కూడా విద్యార్థులు ఆత్మహత్యాయత్నం చేశారనే పుకార్లు అని కొట్టిపారేశారు. వీడియో లీక్ చేసిన అమ్మాయిని హాస్టల్ వార్డెన్ తిట్టిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో లీక్ విషయాన్ని పోలీసులకు ముందుగా చెప్పనందుకు ఆమెను, మరో వార్డెన్‌ను కూడా అధికారులు సస్పెండ్ చేశారు.