Site icon NTV Telugu

Supreme Court: జడ్జిలను సోషల్‌ మీడియాలో దూషిస్తే శిక్షే..

Supreme Court

Supreme Court

Supreme Court: ఇకపై సోషల్‌ మీడియా వేదికగా జడ్జిలను దూషిస్తే శిక్షలు తప్పవు. తమకు అనుకూలంగా తీర్పు రాకపోయినా.. లేకపోతే తమకు ఇష్టంలేని తీర్పు చెప్పారనో జడ్జిలను సోషల్‌ మీడియాల ద్వారా దూషిస్తే .. అలా చేసిన వారు శిక్షకు గురికావల్సిందే. సామాజిక మాధ్యమాల ద్వారా న్యాయాధికారులను దూషించిన వారిని శిక్షించడం సబబేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సోషల్‌ మీడియాలో జిల్లా జడ్జిపై అవినీతి ఆరోపణలు చేసిన వ్యక్తికి పది రోజుల జైలు శిక్ష విధిస్తూ మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్‌ బేల ఎం త్రివేది, జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం సమర్థించింది. తమరే అనుకూలంగా తీర్పు రానంత మాత్రాన జడ్జిని దూషించలేరని తెలిపింది. న్యాయ వ్యవస్థ స్వతంత్రత కలిగినదని .. అంటే కార్యనిర్వాహక వ్యవస్థ నుంచే కాకుండా బయట వ్యక్తుల నుంచి కూడా స్వతంత్రంగా ఉండాలన్న అర్థమని ధర్మాసనం స్పష్టం చేసింది. .

Read Also: Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

న్యాయాధికారిపై ఆరోపణలు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి ఉంటుందని తెలిపింది. శిక్ష మరీ కఠినంగా ఉందని.. కనికరం చూపాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోరగా.. అలాంటి వాటిని క్షమించేది లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. దేవాలయానికి సంబంధించిన కేసులో తీర్పు చెప్పిన అదనపు జిల్లా జడ్జిపై ఆరోపణలు చేసినందుకు కృష్ణ కుమార్‌ రఘువంశి అనే వ్యక్తిపై హైకోర్టు సుమోటోగా క్రిమినల్‌ కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసింది. దీనిపై ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.

Exit mobile version