Pulivarthi Sudha Reddy: చెవిరెడ్డి కుటుంబం బతిమాలడంతోనే వెనక్కి తగ్గా, లేదంటే.. పులివర్తి సుధారెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Pulivarthi Sudha Reddy

Pulivarthi Sudha Reddy

తిరుపతి రూరల్ జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌పై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, రీకౌంటింగ్ కోరే అవకాశం ఉన్నప్పటికీ మానవతా దృక్పథంతో వెనక్కి తగ్గామని వెల్లడించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు బతిమాలడంతోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. అయితే రీకౌంటింగ్ వదులుకోవడం తప్పు నిర్ణయమని ఇప్పుడు భావిస్తున్నట్లు సుధా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో కౌంటింగ్ రూమ్‌ను మార్చడంపై తాము అభ్యంతరం వ్యక్తం చేసినట్లు పులివర్తి సుధా రెడ్డి తెలిపారు. ఎన్నికల ఫలితాల్లో కేవలం 600 ఓట్ల తేడా మాత్రమే ఉండగా, 2 వేలకు పైగా ఓట్లు చెల్లనివిగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో రీకౌంటింగ్ కోరాలని భావించినప్పటికీ.. చెవిరెడ్డి కుటుంబ సభ్యులు తమ వద్దకు వచ్చి బతిమాలడంతో ఆ నిర్ణయాన్ని విరమించుకున్నామని చెప్పారు. పెద్ద కొడుకు ఇప్పటికే ఎన్నికల్లో ఓడిపోయాడని, చిన్న కొడుకు కూడా ఓడిపోతే డిప్రెషన్‌లోకి వెళ్లే అవకాశం ఉందని చెప్పి రీకౌంటింగ్ కోరవద్దని కుటుంబ సభ్యులు వేడుకున్నారని వెల్లడించారు. వారి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మానవతా దృక్పథంతో రీకౌంటింగ్ పిటిషన్ వేయకుండా వెనక్కి తగ్గామని సుధా రెడ్డి తెలిపారు.

అయితే తాము చూపించిన హుందాతనాన్ని అవతలి వారు గౌరవించలేదని పులివర్తి సుధా రెడ్డి విమర్శించారు. రీకౌంటింగ్ వదులుకోవడం ద్వారా తప్పు చేశామని ఇప్పుడు అనిపిస్తోందని పేర్కొంటూ, తమ హుందాతనానికి, వారి దిగజారుడుతనానికి పోలిక లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి రూరల్ జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌పై సుధా రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. తిరుపతి రూరల్ జెడ్పీటీసీ అభ్యర్ధిగా చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి 600 ఓట్లతో విజయం సాధించారు.