MLAs Arrested: హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నేడు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు పలువురు ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యేలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని బస్సుల్లో, పోలీస్ వాహనాల్లో తరలించారు.
ఇందులో భాగంగా మొదట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. టీషర్ట్ విప్పి బనియన్‌తోనే పబ్లిక్ గార్డెన్స్‌లోకి వెళ్లేందుకు ఆయన ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం హరీశ్ రావును బలవంతంగా పోలీస్ ఇన్నోవా వాహనంలోకి ఎక్కించి తరలించారు. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, సంజయ్ రావుతో పాటు పలువురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక్కో ఎమ్మెల్యేను నలుగురు పోలీసులు కలిసి ఎత్తుకుని బస్సులోకి బలవంతంగా ఎక్కించారు.
మరోవైపు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ వాహనంలోకి ఎక్కించే సమయంలో కేటీఆర్ ప్రతిఘటించారు. ఆయన కారు ఎక్కకుండా రోడ్డుపై కాలుతో అదిమి పట్టుకున్నప్పటికీ పోలీసులు బలవంతంగా ఇన్నోవాలోకి ఎక్కించారు. రోడ్డుపై బైఠాయించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దీనితో బీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలందరినీ అదుపులోకి తీసుకుని పబ్లిక్ గార్డెన్స్ నుంచి పోలీసులు తరలించారు. ఈ ఘటనతో పబ్లిక్ గార్డెన్స్ పరిసరాల్లో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి.

