Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!

Pesara Laddu

Pesara Laddu

Pesara Laddu Recipe: పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వారికి రుచికరమైన, ఆరోగ్యకరమైన స్నాక్స్ ఇవ్వాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అంతేకాకుండా బయటి చిరుతిండి తగ్గించడానికి ఇంట్లోనే ప్రోటీన్ రిచ్ ఫుడ్ అందిస్తే అది వారికి కూడా మేలు అవుతుంది. అలాంటి వారికోసమే గ్రీన్ మూంగ్ దాల్ (పెసర్లు)తో చేసే ఈ లడ్డూలు మంచి ఎంపిక. పెసర్లలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు సమృద్ధిగా ఉండటంతో పిల్లల ఎదుగుదలకు ఇవి ఎంతో ఉపయోగపడతాయి. బెల్లం, డ్రై ఫ్రూట్స్, నెయ్యి కలిపి చేసే ఈ లడ్డూలు రుచితో పాటు పోషకాలను కూడా అందిస్తాయి. ముఖ్యంగా వీటిని ఒక నెల వరకు నిల్వ చేసుకోవచ్చు.

కావలసిన పదార్థాలు:

* పెసర్లు – 1 కప్పు
* బెల్లం – ½ కప్పు (తీపి ఎక్కువ కావాలంటే 1 కప్పు)
* నీరు – అవసరమైనంత
* నెయ్యి – 4 టేబుల్ స్పూన్లు
* బాదం – 12
* జీడిపప్పు – 10
* కిస్మిస్ – కొద్దిగా
* యాలకుల పొడి – 1 టేబుల్ స్పూన్
* పాలు – 3 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం:

ముందుగా ఒక కప్పు పెసర్లను తీసుకుని రెండు నుంచి మూడు సార్లు బాగా కడిగి నీరు పూర్తిగా వడకట్టాలి. తర్వాత ఒక వెడల్పాటి కడాయిలో వేసి మొదట హై ఫ్లేమ్‌పై నీరు పూర్తిగా ఆవిరయ్యే వరకు వేయించాలి. ఆ తర్వాత చిన్న మంటపై పెసర్లు మంచి సువాసన వచ్చి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. తర్వాత వాటిని పూర్తిగా చల్లారనివ్వాలి.

ఇప్పుడు మరో పాత్రలో బెల్లం, కొద్దిగా నీరు వేసి కరిగించాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత వడకట్టి మళ్లీ స్టవ్‌పై ఉంచి రెండు పొంగులు వచ్చే వరకు మాత్రమే వేడి చేయాలి. పాకం తయారు చేయాల్సిన అవసరం లేదు. అనంతరం చల్లారనివ్వాలి. చల్లారిన పెసర్లను మిక్సీ జార్‌లో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. కావాలంటే వడకట్టుకోవచ్చు. ఇప్పుడు కడాయిలో నెయ్యి వేసి బాదం, జీడిపప్పు, కిస్మిస్‌ను వేయించి పక్కన పెట్టాలి.

అదే కడాయిలో పెసరపిండి వేసి చిన్న మంటపై నెయ్యి మొత్తం పిండికి పట్టేలా, మంచి సువాసన వచ్చే వరకు సుమారు 15 నుంచి 20 నిమిషాలు వేయించాలి. అవసరమైతే మరికొంత నెయ్యి జోడించవచ్చు. పెసరపిండి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి యాలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలపాలి. తర్వాత చల్లారిన బెల్లం పాకాన్ని కొద్దికొద్దిగా పోస్తూ బాగా కలపాలి. మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతులతో లడ్డూలుగా చుట్టుకోవాలి.

ఒకవేళ మిశ్రమం చల్లారిపోయి లడ్డూలు చుట్టడానికి కష్టంగా అనిపిస్తే.. 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల కాచి చల్లార్చిన పాలు వేసి మళ్లీ కలిపి లడ్డూలు తయారు చేసుకోవచ్చు. ఈ పెసర లడ్డూలను గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేస్తే ఒక నెల వరకు తాజాగా ఉంటాయి. పిల్లలకు సాయంత్రం స్నాక్‌గా లేదా ఉదయం అల్పాహారంతో పాటు ఇవ్వడానికి ఇవి బెస్ట్ ఛాయిస్.