Prakasam Barrage: ఇటీవల కురిసిన భారీ వర్షాలు ఏపీని వరదలతో ముంచెత్తాయి. ఈ భారీ వరదల సమయంలో ఐదు బోట్లు ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టాయి. బోట్లు ఢీకొని మూడు గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనపై ఇప్పటికే టీడీపీ, వైసీపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. ప్రకాశం బ్యారేజీ వద్ద జలవనరుల శాఖ బోట్ల తొలగింపు ప్రక్రియను జలవనరుల శాఖ చేపట్టింది. ప్రస్తుతం పడవల తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. గేట్ల వద్ద చిక్కుకున్న భారీ పడవలను క్రేన్ల సాయంతో తీయడం సాధ్యం కాకపోవడంతో ముక్కలు చేసి తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. క్రేన్ల సాయంతో తొలగించేందుకు ప్రయత్నించగా.. ఒక్కొ్క్కటి 40 టన్నుల బరువు ఉండడంతో అది సాధ్యం కాలేదు.
Read Also: Minister Narayana: ఆపరేషన్ బుడమేరు ద్వారా ప్రజలకు ఇబ్బంది లేకుండా యాక్షన్ ప్లాన్
దీంతో నది లోపలికి దిగి పడవలను గ్యాస్ కట్టర్లతో ముక్కలు చేసే అండర్ వాటర్ బోట్ కటింగ్ కొనసాగుతోంది. పైకి కనిపిస్తున్న పడవను మొదట డైవింగ్ టీం కటింగ్ చేస్తోంది. ప్రతీ గంటన్నరకు ఇద్దరు కటింగ్ టీంతో బోట్ కటింగ్ జరుగుతోంది. మొదటి బోట్ అడుగు నుంచీ కటింగ్ మొదలైంది. విశాఖ నుంచి 10 మంది డైవింగ్ సభ్యుల బృందం ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకుని పనులను ప్రారంభించింది. సాయంత్రం వరకు ఒక పడవను తొలగించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. రోజుకు ఒక బోటు చొప్పున 3 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగనున్నట్లు అధికారులు మంత్రికి తెలిపారు.